Bones Health : మన శరీరంలో ఎముకలు వంగి పోకుండా దృఢంగా ఉండడానికి, పిల్లల ఎదుగుదలకు కాల్షియం ఎంతో అవసరమని మనందరికీ తెలుసు. కాల్షియం అధికంగా కలిగి ఉన్న ఆహారాలలో మనకు మొదటగా గుర్తుకు వచ్చేవి పాలు. శరీరానికి కావల్సిన కాల్షియాన్ని అందించడానికి మనం ప్రతి రోజు పాలను తాగుతూ ఉంటాం. పిల్లలకు కూడా పాలను ఆహారంగా ఇస్తూ ఉంటాం. మనలో చాలా మందికి పాలలోనే కాల్షియం అధికంగా ఉంటుందా.. పాల కంటే కాల్షియం అధికంగా కలిగి ఉన్న ఆహార పదార్థాలు ఉండవా.. అనే సందేహాలు వస్తూ ఉంటాయి. పాలను తాగడం వల్ల మన శరీరానికి కావల్సిన శక్తి, కాల్షియం లభిస్తాయని మనకు తెలుసు. ఈ పాలు మనకు ఆవులు, గేదెల నుండి లభిస్తాయి.
ఆవులు, గేదెలు మనకు గడ్డిని, ఆకులను తిని పాలను ఇస్తాయి. కనుక పాలలో కంటే గడ్డిలో, ఆకులలో కాల్షియం అధికంగా ఉంటుంది. పాలలో కంటే గడ్డిలో, ఆకులలో 5 రెట్లు కాల్షియం అధికంగా ఉంటుంది. కనుక పాలలో కంటే కాల్షియం అధికంగా కలిగిన ఆహార పదార్థాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. పాల ద్వారా మాత్రమే కాకుండా ఈ ఆహార పదార్థాలను తినడం వల్ల కూడా మన శరీరానికి కావల్సిన కాల్షియం లభిస్తుంది.
పిల్లలకు రోజుకు 600 మిల్లీ గ్రాములు, 20 సంవత్సరాలు దాటిన వారికి 450 మిల్లీ గ్రాములు, గర్భిణీలకు, బాలింతలకు 900 మిల్లీ గ్రాముల కాల్షియం అవసరమవుతుంది. కాల్షియం కోసం మనం పాలను తాగుతూ ఉంటాం. కానీ ఈ పాలలో ఉండే కాల్షియాన్ని పేగులు గ్రహించడానికి విటమిన్ డి అవసరమవుతుంది. విటమిన్ డి మనకు సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది. మన శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే పాలను తాగినా కూడా మన శరీరానికి కావల్సిన కాల్షియం లభించదు. మన శరీరానికి కావలసినంత విటమిన్ డి ఉంటేనే ఎముకలు ధృడంగా ఉంటాయి.
రోజూ పాలు తాగినా కూడా కొంతమంది పిల్లలో ఎదుగుదల లేకపోవడాన్ని మనం గమనించవచ్చు. పాలు తాగిన కూడా పిల్లలో ఎదుగుదల లేకపోవడానికి విటమిన్ డి లోపం కూడా ఒక కారణం కావచ్చు అని నిపుణులు చెబుతున్నారు. 100 గ్రా. ల చిక్కటి ఆవు పాలలో 120 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. 100 గ్రా. ల చిక్కటి గేదె పాలలో 220 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. పిల్లల శరీరానికి రోజుకి సరిపడా కాల్షియం కోసం అర లీటర్ పాలను ఆహారంగా ఇవ్వాల్సి ఉంటుంది.
పిల్లలు రోజూ అర లీటర్ పాలను తాగరు. అలాగే మనకు చిక్కటి పాలు ఎక్కువగా లభించవు. ఒక వేళ లభించినా అవి ఎక్కువగా ధర ఉంటాయి. పాలకు బదులుగా తక్కువ ఖర్చులో కాల్షియాన్ని కలిగిన ఆహార పదార్థాలను మనం ఆహారంగా తీసుకోవాలి. పాల కంటే కాల్షియం అధికంగా తోటకూర, మునగాకు, మెంతికూర, పొన్నగంటి కూర, కరివేపాకు, నువ్వులలో ఉంటుంది. పాల కంటే కాల్షియం వీటిలో అధికంగా ఉంటుంది.
100 గ్రా. ల నువ్వులలో 1450 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. కనుక పాలకు బదులుగా ఒక్క నువ్వుల ఉండ (లడ్డూ)ను పిల్లలకు ఆహారంగా ఇవ్వడం వల్ల రోజుకి సరిపడా కాల్షియం లభిస్తుంది. పాలు సంపూర్ణ ఆహారం అని మనందరికీ తెలుసు. కానీ పిల్లలకు దంతాలు రానంత వరకు మాత్రమే పాలు సంపూర్ణ ఆహారం. కనుక ఎదిగే పిల్లలకు పాలతోపాటు ఈ ఆకుకూరలను ఆహారంగా ఇవ్వడం వల్ల శరీరానికి కావల్సిన కాల్షియంతోపాటు పోషకాలు కూడా లభిస్తాయి. ఇక పెద్దలు కూడా రోజూ ఆయా ఆకు కూరలను తినడంతోపాటు రోజుకు ఒక నువ్వుల ఉండను తినడం వల్ల పుష్కలంగా కాల్షియం లభిస్తుంది. దీంతో ఎముకలు దృఢంగా ఉంటాయి.