మన శరీరానికి అవసరమయ్యే అనేక పోషకాల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఒకటి. ఇవి గుండె ఆరోగ్యంతోపాటు పలు ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా చూస్తాయి. అయితే ఒమెగా 3 లాగే ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఉంటాయి. ఇవి కూడా మన శరీరానికి కావల్సిన పోషకాలే. వీటిని కూడా మనం తరచూ తీసుకోవాల్సి ఉంటుంది.
ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లను మన శరీరం తనంతట తానుగా తయారు చేసుకోలేదు. మనం ఆహారం ద్వారానే వీటిని శరీరానికి అందివ్వాల్సి ఉంటుంది. వీటి వల్ల శరీర ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. మెదడు పనితీరు మెరుగు పడుతుంది. చర్మం, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎముకలు దృఢంగా ఉంటాయి. జీవక్రియలు సరిగ్గా నిర్వర్తించబడతాయి. పునరుత్పత్తి వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు రకరకాల రూపంలో ఉంటాయి. వీటిల్లో ప్రధానమైంది లినోలిక్ యాసిడ్. ఇది శరీరంలోకి వెళ్లాక గామా-లినోలిక్ యాసిడ్ (జీఎల్ఏ)గా మారుతుంది. గుండెపోటు, పక్షవాతం వంటి వ్యాధులను కలగజేసే వాపులను తగ్గించేందుకు ఇది సహాయ పడుతుంది. ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు వంట నూనెలు, విత్తనాల్లో ఎక్కువగా ఉంటాయి.
బాదపప్పు, వాల్‌నట్స్, వేరుశెనగలు, నువ్వులు, గుమ్మడికాయ విత్తనాఉ, చేపలు, మటన్, చికెన్, గుడ్లు వంటి వాటిలో ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ ఆహారాలను తరచూ తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.
ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు మన ఆరోగ్యానికి రకరకాలుగా ఉపయోగపడతాయి. వివిధ సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.
1. ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లలో ఒకటైన లినోలిక్ యాసిడ్లు శరీరంలో కొవ్వును తగ్గించడంతోపాటు కండర దారుఢ్యాన్ని మెరుగు పరుస్తాయి. అధిక బరువు తగ్గేందుకు సహాయ పడతాయి.
2. ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్)ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)ను పెంచుతాయి. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూస్తాయి.
3. ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి. ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.
అందువల్ల ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాలను తరచూ తీసుకోవాల్సి ఉంటుంది.