Vitamin D : మన శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన పోషకాల్లో విటమిన్ డి కూడా ఒకటి. మన శరీరం సక్రమంగా పని చేయాలంటే మన శరీరానికి తగిన మోతాదులో విటమిన్ డి ని అందించడం చాలా అవసరం. శరీరంలో వీలైనంత వరకు మన శరీరంలో విటమిన్ డి లోపం తలెత్తకుండా చూసుకోవాలి. విటమిన్ డి లోపం రావడం వల్ల శరీరంలో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఎముకలు, కండరాలకు సంబంధించిన అనేక సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నేటి తరుణంలో మనలో చాలా మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. దాదాపు 50 శాతం జనాభా ఈ లోపంతో బాధపడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. ప్రతిరోజూ మన శరీరానికి 20 మైక్రో గ్రాముల విటమిన్ డి అవసరమవుతుంది. చాలా మంది విటమిన్ డి లోపం తలెత్తగానే విటమిన్ డి క్యాప్సుల్స్ ను వాడుతూ ఉంటారు.
ఇవే కాకుండా మనం తీసుకునే ఆహారం ద్వారా కూడా మనం మన శరీరానికి కావల్సినంత విటమిన్ డి అందించవచ్చు. ఈ ఆహారాలను ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరంలో విటమిన్ డి లోపం తలెత్తకుండా ఉంటుంది. విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలు ఏమిటి.. అలాగే వీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంత విటమిన్ డి లభిస్తుంది..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాల్లో సాల్మన్ చేపలు కూడా ఒకటి. వీటిలో విటమిన్ డి అధికంగా ఉంటుంది. 100 గ్రాముల సాల్మన్ పిష్ లో 66 శాతం విటమిన్ డి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల మనం విటమిన్ డి లోపాన్ని చాలా సులభంగా అధిగమించవచ్చు. అలాగే కోడిగుడ్లల్లో కూడా విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. ఒక కోడిగుడ్డులో 5 శాతం వరకు విటమిన్ డి ఉంటుంది.
కోడిగుడ్లను తీసుకోవడం వల్ల విటమిన్ డి తో పాటు మనకు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. విటమిన్ డి లోపంతో బాధపడే వారు కోడిగుడ్లను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే కొన్ని రకాల పుట్టగొడుగుల్లో కూడా విటమిన్ డి అధికంగా ఉంటుంది. మోరెల్స్ అనే అడవిలో పెరిగే పుట్టగొడుగులో 17 శాతం విటమిన్ డి ఉంటుంది. ఈ పుట్టగొడుగుపై కాంతి పడినప్పుడు దానిలో ఉండే విటమిన్ డి శాతం మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే పాలు, పాల ఉత్పత్తులైన చీస్ లో కూడా విటమిన్ డి అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే విటమిన్ డి లభిస్తుంది.
అలాగే ఆవు పాలు, సోయా పాలు, ఆరెంజ్ జ్యూస్, ఓట్ మీల్ వంటి వాటిలో కూడా విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల కూడా శరీరానికి కావల్సిన విటమిన్ డి లభిస్తుంది. కనుక ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల మన శరీరంలో విటమిన్ డి లోపం తలెత్తకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.