శనగలను మనలో చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. చాలా మంది వీటిని ఉడకబెట్టి గుగ్గిళ్ల రూపంలో తీసుకుంటారు. కొందరు శనగలతో కూరలు చేస్తారు. అయితే ఎలా తీసుకున్నప్పటికీ శనగలతో మనకు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. మాంసం తినలేనివారికి శనగలు అద్భుతమైన ఆహారం అనే చెప్పవచ్చు. ఎందుకంటే శనగల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. నిత్యం ఒక కప్పు శనగలను తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
శనగల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పు శనగల ద్వారా మనకు సుమారుగా 474 మిల్లీగ్రాముల పొటాషియం లభిస్తుంది. పొటాషియం మన శరీరంలో బీపీని నియంత్రిస్తుంది. గుండె సమస్యలు రాకుండా చూస్తుంది. అందువల్ల నిత్యం శనగలను తింటే హైబీపీ తగ్గుతుంది. అలాగే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
డయాబెటిస్ ఉన్నవారికి శనగలు మంచి ఆహారం అని చెప్పవచ్చు. వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అంటే వీటిని తింటే రక్తంలో షుగర్ లెవల్స్ వెంటనే పెరగవు. పైగా వీటిలో ఉండే ఫైబర్ నెమ్మదిగా జీర్ణం అవుతుంది. అందువల్ల రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి. ఫలితంగా డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
శనగల్లో ఐరన్, కాల్షియం, విటమిన్ సి, ఎ, ఇ, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఎముకలు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటాయి. అలాగే శరీరం ఐరన్‌ను ఎక్కువగా గ్రహిస్తుంది. దీంతో రక్తహీనత సమస్య రాదు. హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
శనగల్లో రాఫినోస్ అనబడే సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తుంది. జీర్ణవ్యవస్థలో ఉండే విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. దీంతో ఆ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. శనగల్లో ఉండే పోషకాలు మన శరీరానికి పోషణను అందిస్తాయి.
శనగల్లో ఉండే సెలీనియం, మెగ్నిషియం, పొటాషియం, విటమిన్ బి, ఫైబర్, ఐరన్ వంటి పోషకాలు శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్)ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)ను పెంచుతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365