ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 1000కి పైగా భిన్న రకాలకు చెందిన అరటి పండ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఎరుపు రంగు అరటిపండ్లు కూడా ఒకటి. ఇవి ఆసియా ఖండంలో పలు చోట్ల విస్తృతంగా లభిస్తాయి. సాధారణ అరటి పండ్లతో పోలిస్తే ఇవి చాలా మృదువుగా, తియ్యగా ఉంటాయి. ఇక ఇవి రాస్ప్‌బెర్రీల రుచిని పోలి ఉంటాయి. వీటిని సాధారణంగా చాలా మంది డిజర్ట్ డిష్‌లలో తింటారు. అయితే వీటిని నేరుగా కూడా తినవచ్చు. ఈ అరటి పండ్లలో మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాలు ఉంటాయి. అవి మన రోగ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి.
ఎరుపు రంగు అరటి పండ్ల వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎరుపు రంగు అరటి పండ్లలో పొటాషియం, విటమిన్ సి, విటమిన్ బి6, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. 100 గ్రాముల ఎరుపు రంగు అరటి పండ్లను తినడం వల్ల 90 క్యాలరీలు లభిస్తాయి. 21 గ్రాముల పిండి పదార్థాలు, 1.3 గ్రాముల ప్రోటీన్లు, 0.3 గ్రాముల కొవ్వులు, 3 గ్రాముల ఫైబర్, రోజుకు కావల్సిన పొటాషియంలో 9 శాతం, విటమిన్ బి6 28 శాతం, విటమిన్ సి 9 శాతం, మెగ్నిషియం 8 శాతం లభిస్తాయి. వీటి వల్ల శరీరానికి పోషణ అందుతుంది.
పొటాషియం ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల హైబీపీ తగ్గుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఎరుపు రంగు అరటి పండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల హైబీపీ తగ్గుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది.
ఎరుపు రంగు అరటి పండ్లలో కెరోటినాయిడ్స్ ఉంటాయి. అందువల్లే అవి ఎరుపు రంగులో ఉంటాయి. వాటి వల్ల అరటి పండు తొక్క ఎరుపు రంగులోకి మారుతుంది. నిజానికి కెరోటినాయిడ్స్ కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. కంటి చూపును పెంచుతాయి. దృష్టి సమస్యలు ఉండవు. ఈ అరటి పండ్లలో ఉండే లుటీన్ అనే సమ్మేళనం వల్ల కళ్లు సురక్షితంగా ఉంటాయి.
ఈ అరటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. సాధారణ అరటి పండ్లతో పోలిస్తే ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్ల పరిమాణం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల శరీరానికి హాని చేసే ఫ్రీ ర్యాడికల్స్ నాశనం అవుతాయి. అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది. దీంతో గుండె జబ్బులు, డయాబెటిస్, క్యాన్సర్ రాకుండా ఉంటాయి. ఈ అరటి పండ్లలో ఉండే కెరోటినాయిడ్స్, ఆంథో సయనిన్స్, విటమిన్ సి, డోపమైన్‌లు యాంటీ ఆక్సిడెంట్లలా పనిచేస్తాయి.
విటమిన్ సి, బి6లు ఎరుపు అరటి పండ్లలో సమృద్దిగా ఉంటాయి. అందువల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
ఎరుపు రంగు అరటి పండ్లలో ప్రీ బయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణాశయంలో మంచి బాక్టీరియాను పెంచుతాయి. దీంతో గ్యాస్, మలద్దకం, అజీర్ణం సమస్యలు ఉండవు. ఈ పండ్లలో ఉండే ఫైబర్ ఇన్‌ఫ్లామేటరీ బోవెల్ డిసీజ్ (ఐబీడీ)ని రాకుండా చూస్తుంది. క్రాన్స్ డిసీజ్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.
సాధారణ అరటి పండ్లతో పోలిస్తే ఎరుపు రంగు అరటి పండ్లు తియ్యగా ఉన్నప్పటికీ వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువే. పసుపు రంగు అరటి పండ్ల గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ 51 కాగా ఎరుపు రంగు అరటి పండ్ల గ్లైసీమిక్ ఇండెక్స్ 45. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు వీటిని తినవచ్చు. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అంత త్వరగా పెరగవు. డయాబెటిస్ అదుపులోనే ఉంటుంది.