Bananas : మనం అనేక రకాల పండ్లను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వాటిలో అరటి పండు కూడా ఒకటి. అరటిపండు చాలా రుచిగా ఉంటుంది. అలాగే మనకు అన్ని కాలాల్లో తక్కువ ధరలో లభిస్తూ ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. కొందరు నేరుగా తినడంతో పాటు పెరుగన్నంలో కూడా అరటిపండు వేసుకుని తింటూ ఉంటారు. ఈ అలవాటు మనలో చాలా మందికి ఉంది. చాలా మంది పెరుగన్నంలో అరటి పండు వేసుకుని ఇష్టంగా తింటూ ఉంటారు. పెరుగన్నంలో అరటిపండు వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. అయితే ఇలా పెరుగన్నంలో అరటిపండు వేసుకుని తినడం మంచిదా.. కాదా.. తింటే ఏమౌతుంది. అలాగేదీనిని ఎవరు తినవచ్చు.. ఎవరు తినకూడదు.. దీని గురించి నిపుణులు ఏమంటున్నారు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మనకు ఎక్కువ శక్తిని ఇచ్చే పండ్లల్లో అరటిపండు కూడా ఒకటి. 100 గ్రాముల మామిడి పండ్లల్లో 74 క్యాలరీలు, 100 గ్రాముల పనస తొనలల్లో 88 క్యాలరీలు, సపోటాలో 94 క్యాలరీలు, సీతాఫలంలో 104 క్యాలరీల శక్తి ఉంటుంది. కానీ అరటి పండులో 116 క్యాలరీల శక్తి ఉంటుంది. అన్ని పండ్లల్లో కంటే అరటిపండులో శక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే పూర్వం రోజుల్లో పని ఎక్కువగా చేసేవారు. వారికి శక్తి ఎక్కువగా అవసరమయ్యేది. పూర్వం రోజుల్లో తినడానికి ఇన్ని ఆహారాలు, పండ్లు ఉండేవి కావు. మూడు పూటలా అన్నాన్ని మాత్రమే ఆహారంగా తీసుకునే వారు. అలాగే పూర్వం దాదాపు ప్రతి ఇంట్లో అరటి చెట్లు ఉండేవి. పండ్లను నేరుగా తినడానికి వారికి అంతగా సమయం ఉండేది కూడా కాదు.
దీంతో చాలా మంది పెరుగన్నంలో, మజ్జిగన్నంలో అరటిపండును కలిపి తినేవారు. అలాగే పిల్లలు ఎవరైనా అరటిపండ్లను రెండు లేదా మూడు ఒకేసారి తింటే వారు మరలా అన్నం తినరనే కారణం చేత అరటిపండ్లను పెరుగన్నంతోనే తినాలి అని పెద్దలు చెప్పేవారు. అయితే ప్రస్తుత రోజుల్లో అరటిపండును పెరుగుతో తినకూడదని నిపుణులు చెబుతున్నారు. నేటి తరుణంలో చాలా మంది ఉద్యోగ, వ్యాపారాలు చేస్తున్నారు. వారికి ఎక్కువగా శక్తి అవసరముండదు. కనుక పెరుగన్నంలో అరటి పండును తినకపోవడమే మంచిదని వారు చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో మనకు అనేక రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి.
కనుక రోజులో రెండు పూటలా ఉడికించిన ఆహారాలను, ఒకపూట పండ్లను తీసుకోవడం మంచిది. రాత్రి సమయంలో ఇతర పండ్లతో పాటు అరటిపండును కూడా తీసుకోవాలి. పెరుగున్నంతో కాకుండా అరటిపండును నేరుగా తీసుకోవడం మంచిది. అదేవిధంగా బరువు పెరగాలనుకునే వారు 3 నుండి 4 అరటిపండ్లను తీసుకోవచ్చు. బరువు అదుపులో ఉండాలనుకునే వారు, షుగర్ వ్యాధి గ్రస్తులు ఒకటి అరటిపండును తీసుకోవాలి. అయితే బరువు పెరగాలనుకునేవారు తక్కువ సమయంలో ఎక్కువ బరువు పెరగాలనుకునే వారు పెరుగన్నంలో అరటిపండు కలిపి తీసుకోవచ్చు. పెరుగన్నంలో అరటిపండు కలిపి తీసుకోవడం వల్ల క్యాలరీలు ఎక్కువగా వస్తాయి. దీంతో బరువు ఎక్కువగా పెరుగుతారు.
బరువు పెరగాలనుకునే వారు, శక్తి ఎక్కువగా అవసరమయ్యే వారు పెరుగన్నంలో అరటిపండును తీసుకోవచ్చు. అలాగే కొందరు ఉప్పు, నూనె లేని ఆహారాలను తీసుకుంటూ ఉంటారు. అలాంటి వారు బయటకు వెళ్లినప్పుడు బయట ఈఆహారాన్ని తీసుకోలేరు. ఆసమయంలో పెరుగన్నంలో అరటిపండును తీసుకోవచ్చు. అదే విధంగా మలవిసర్జన సమయంలో కొందరికి మలంలో రక్తం వస్తూ ఉంటుంది. అలాగే నీళ్ల విరోచనాలతో అప్పుడప్పుడూ బాధపడుతూ ఉంటారు. అలాంటివారు 2నుండి 3 రోజుల పాటు ఇతర ఆహారాలను మానేసి కేవలం పెరుగన్నానే తింటూ ఉంటారు. రోజూ పెరుగన్నాన్ని తినలేని వారు దానిలో అరటిపండును కలిపి తీసుకోవచ్చు. ఇలా సందర్భాన్ని బట్టి పెరుగనన్నంలో అరటిపండును తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పెరుగన్నంలో అరటిపండును తీసుకోవడం మంచిదే అయినప్పటికి రోజూ తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు సూచిస్తున్నారు.