Guava : మనకు విరివిగా తక్కువ ధరలో లభించే పండ్లల్లో జామకాయలు కూడా ఒకటి. ఇవి మనకు కొన్ని రోజులు మినహా సంవత్సరం అంతా లభిస్తూనే ఉంటాయి. పూర్వకాలంలో గ్రామాలలో ఇంటికొక జామచెట్టు ఉండేది. ఇతర పండ్ల లాగా జామకాయల్లో కూడా మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఉంటాయి. జామకాయలల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఆకుకూరల్లో లభించే పీచు పదార్థాల కంటే రెండితల పీచుపదార్థాలు జామకాయల్లో ఎక్కువగా ఉంటాయి. జామకాయలను తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది.
జామకాయల రసాన్ని తాగడం వల్ల కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. అంతేకాకుండా శరీరంలో అధికంగా ఉండే కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. ప్రతి రోజూ జామకాయలను తినడం వల్ల లేదా జామకాయ రసాన్ని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. జామకాయలను నమిలి తినడం వల్ల దంతాలు గట్టిగా తయారవుతాయి. దంతాల సమస్యలను, చిగుళ్ల సమస్యలను, గొంతు నొప్పిని నయం చేయడంలో జామ ఆకులు ఎంతో సహాయపడతాయి. జామ ఆకులను మెత్తగా దంచి దంతాలకు, చిగుళ్లకు లేపనంగా రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జామ ఆకులతో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆకలి కూడా పెరుగుతుంది. ఈ టీ ని తాగడం వల్ల వికారం, వాంతులు తగ్గుతాయి.
రోజుకు రెండు జామ కాయలను తినడం వల్ల త్వరగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటిని తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా పలు రకాల క్యాన్సర్ ల బారిన పడకుండా ఉంటాం. జామకాయలను తరుచూ తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో ఉండే నొప్పులను, అలాగే గాయాలను తగ్గించడంలో కూడా జామకాయలు ఉపయోగపడతాయి. జామకాయలను తినడం వల్ల పురుషుల్లో సంతాన లేమి సమస్యలు రాకుండా ఉంటాయి. నెలసరి సమయంలో స్త్రీలు వీటిని తినడం వల్ల ఆ సమయంలో వచ్చే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.
జామకాయల్లో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరచడంలో దోహదపడుతుంది. కనుక జామకాయలను తప్పకుండా మనం తరచూ తీసుకుంటూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో మనం రోగాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వైరస్ లు, బాక్టీరియాలు విజృంభించి మనల్ని ఇన్ ఫెక్షన్ ల బారిన పడేలా చేస్తాయి. కనుక ఈ జామకాయలను తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి మనం జలుబు, దగ్గు, గొంతునొప్పి, వాంతులు, డయేరియా, ఫ్లూ వంటి వాటి బారిన పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.