Dates : మనకు లభించే పండ్లల్లో తియ్యగా ఉండి అధిక శక్తిని ఇచ్చే పండ్లల్లో ఖర్జూర పండ్లు ఒకటి. 100 గ్రా. ల ఖర్జూర పండ్లలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనకు 144 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఎండు ఖర్జూర పండ్ల వల్ల 317 క్యాలరీల శక్తి లభిస్తుంది. అన్ని పండ్ల కంటే ఖర్జూర పండ్లు అధిక క్యాలరీలను కలిగి ఉంటాయి. కాలానుగుణంగా లభించే పండ్లల్లో ఖర్జూర పండ్లు ఒకటి. కానీ ప్రస్తుత కాలంలో మనకు ఈ పండ్లు సంవత్సరం పొడువునా లభిస్తున్నాయి. ఇతర పండ్లు త్వరగా పాడవుతాయి. ఖర్జూర పండ్లు త్వరగా పాడవకుండా ఉండడమే కాకుండా వాటిల్లో ఉండే క్యాలరీలను కూడా కోల్పోకుండా ఉంటాయి.

ఖర్జూర పండ్లను మనం ఎక్కువ మొత్తంలో తీసుకుని కూడా మనం ఇంట్లో నిల్వ చేసుకోవచ్చు. ఈ పండ్లల్లో ఉండే గింజలను తీసేసి మెత్తగా చేసుకుని గాలి చొరబడని కవర్ లో పెట్టి ఫ్రిజ్ లో కానీ బయట కానీ పెట్టి నిల్వ చేసుకోవచ్చు. బెల్లం, పంచదారలకు బదులుగా ఇలా చేసి పెట్టుకున్న ఖర్జూర పండ్ల గుజ్జును వాడుకోవడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
ఎండు ఖర్జూర పండ్లను పొడిగా చేసి పాలలో, జ్యూస్‌లలో వాడవచ్చు. తరుచూ ఖర్జూర పండ్లను వాడడం వల్ల వీటిల్లో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. పండు ఖర్జూరాలలో 1 మిల్లీ గ్రాము, ఎండు ఖర్జూరాలలో 7.3 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది. కొబ్బరిఉండలు, పల్లీ పట్టి, పుట్నాల పప్పు ఉండలు, బొబ్బట్లు, బూరెలు వంటి రకరకాల తీపి పదార్థాలను తయారు చేయడంలో బెల్లానికి, పంచదారకు బదులుగా ఖర్జూర పండ్ల గుజ్జును వాడవచ్చు.
ఇలా ఖర్జూర పండ్లతో తయారు చేసిన తీపి పదార్థాలను తినడం వల్ల దంతాలకు, శరీరానికి ఎటువంటి హాని కలగదు. 100 గ్రాముల పండు ఖర్జూరాలలో 34 గ్రా.లు , ఎండు ఖర్జూరాలలో 76 గ్రా. ల పిండి పదార్థాలు ఉంటాయి. అలాగే పండు ఖర్జూరాలలో 22 మిల్లీ గ్రాములు, ఎండు ఖర్జూరాలలో 120 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. షుగర్ వ్యాధి గ్రస్తులు పండు ఖర్జూరాలను తినడం కంటే ఎండు ఖర్జూరాలను తినడం వల్ల మేలు కలుగుతుంది. ఖర్జూర పండ్లను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ఎటువంటి వేడి చేయదని.. వైద్యులు చెబుతున్నారు.