డ్రాగన్ ఫ్రూట్.. ప్రస్తుతం మనకు మార్కెట్‌లో ఎక్కడ చూసినా ఇది లభిస్తోంది. దీన్నే స్ట్రాబెర్రీ పియర్ అంటారు. ఈ పండు తొక్క పింక్ లేదా ఎరుపు రంగులో ఉంటుంది. ఈ పండు తియ్యగా ఉంటుంది. లోపల విత్తనాలు ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్‌లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. డ్రాగన్ ఫ్రూట్‌లో పోషకాలు అధికంగా ఉంటాయి. మన శరీరానికి అవసరం అయ్యే విటమిన్లు, మినరల్స్ ఈ పండ్లలో ఉంటాయి. ఈ పండ్లను తినడం వల్ల పోషకాలు, శక్తి రెండూ లభిస్తాయి. వీటిలో ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్, మెగ్నిషియం, విటమిన్ సి, విటమిన్ ఇ, పాలిఫినాల్స్, కెరోటినాయిడ్స్, బీటా సయనిన్స్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. వీటి వల్ల శరీరానికి పోషణ లభిస్తుంది.
2. మన శరీరంలో మెటబాలిజం ప్రక్రియ వల్ల ఫ్రీ ర్యాడికల్స్ ఏర్పడుతుంటాయి. ఇవి శరీరానికి నష్టం కలగజేస్తాయి. వాపులను కలిగించి వ్యాధులకు కారణం అవుతాయి. కానీ డ్రాగన్ ఫ్రూట్స్‌ను తినడం వల్ల వాటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీంతో కణాలు దెబ్బ తినకుండా రక్షించుకోవచ్చు. వాపులు తగ్గుతాయి. గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్, ఆర్థరైటిస్ రాకుండా జాగ్రత్త పడవచ్చు.
3. ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ రాకుండా చూసుకోవచ్చు. బరువు నియంత్రణలో ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు.
4. డ్రాగన్ ఫ్రూట్‌లో ప్రీ బయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థలో మంచి బాక్టీరియా సంఖ్యను పెంచుతాయి. దీంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఆ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణాశయానికి ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు. దీంతో డయేరియా తగ్గుతుంది.
5. డ్రాగన్ ఫ్రూట్‌లో విటమిన్ సి, కెరోటినాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తాయి.
6. ఐరన్ లోపం, రక్తహీనత సమస్యలు ఉన్నవారు డ్రాగన్ ఫ్రూట్‌లను తింటే మంచిది. దీంతో ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. రక్తం బాగా తయారవుతుంది.
7. డ్రాగన్ ఫ్రూట్‌లో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. దీని వల్ల శరీరానికి శక్తి సరిగ్గా అందుతుంది. కండరాలు దృఢంగా మారుతాయి. ఎముకలు నిర్మాణమవుతాయి. గుండె పోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365