Raw Papaya : మన ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పండ్ల మొక్కల్లో బొప్పాయి చెట్టు ఒకటి. బొప్పాయి పండ్లు మనందరికి తెలిసినవే. వీటిని కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బొప్పాయి పండ్లను తినడం వల్ల మన ఆరోగ్యానికి మేలు కలుగుతుందన్న విషయం మనందరికి తెలిసిందే. కేవలం బొప్పాయి పండ్లను కాకుండా పచ్చి బొప్పాయిలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. బొప్పాయి పండు వలె పచ్చి బొప్పాయిలు కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పచ్చి బొప్పాయిలో కూడా మన శరీరానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఉంటాయి. పచ్చి బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జీర్ణశక్తి సాఫీగా సాగేలా చేయడంలో, చర్మాన్ని ఆరోగ్యాన్ని ఉంచడంలో ఈ పచ్చి బొప్పాయి మనకు ఎంతో మేలు చేస్తుంది. ఈ పచ్చి బొప్పాయి ముఖ్యంగా స్త్రీలకు మరింత మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ పచ్చి బొప్పాయిని ఎటువంటి సమస్యలతో బాధపడే స్త్రీలు తీసుకోవాలి… ఎవరు తీసుకోకూడదు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పచ్చి బొప్పాయి పాలల్లో లాటెక్స్ అనే పదార్థం ఉంటుంది. అలాగే పెపైన్ అనే ఎంజైమ్ కూడా ఉంటుంది. పచ్చి బొప్పాయి పాలల్లో ఉండే లాటెక్స్ అనే పదార్థం గర్భాశయ గోడల సంకోచాలను పెంచుతాయి. ఈ సంకోచాలు పెరగడం వల్ల రక్తస్రావం ఎక్కువగా అవుతుంది. కొంత మంది స్త్రీలల్లో నెలసరి వచ్చినప్పటికి రక్తస్రావం ఎక్కువగా అవ్వదు.

గర్భాశయ గోడల సంకోచాలు ఎక్కువగా లేకపోవడం వల్ల కూడా నెలసరి సమయంలో రక్తస్రావం తక్కువగా అయ్యే అవకాశం ఉంది. నెలసరి సమయంలో రక్తస్రావం ఎక్కువగా అవ్వని స్త్రీలు ఈ పచ్చి బొప్పాయిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. దీనిని మామూలుగా ఉడికించి అలాగే వండుకుని లేదా సలాడ్ లలో వేసుకుని తినవచ్చు. పచ్చి బొప్పాయిలో లాటెక్స్ ఎక్కువగా ఉంటుంది. పెపైన్ తక్కువగా ఉంటుంది. బొప్పాయి పండే కొద్ది లాటెక్స్ తగ్గుతుంది. పెపైన్ ఎక్కువవుతుంది. కనుక బొప్పాయి పండును తినడం వల్ల మనం ఈ ఫలితాలను పొందలేము. అయితే గర్భిణీ స్త్రీలు ఈ పచ్చి బొప్పాయిని తీసుకోకూడదని దీనిని తీసుకోవడం వల్ల గర్భస్రావం అయ్యే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే నెలసరి సమయంలో రక్తస్రావం ఎక్కువగా అయ్యే స్త్రీలు కూడా దీనిని తీసుకోకపోవడమే మంచిది. రక్తస్రావం ఎక్కువగా అయ్యే స్త్రీలు పచ్చి బొప్పాయిని తీసుకోవడం వల్ల మరింత రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి వారు నెలసరి సమయంలో బొప్పాయి పండును తీసుకోవచ్చు. ఈ విధంగా పచ్చి బొప్పాయి కూడా మనకు ఎంతో మేలు చేస్తుందని దీనిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి పండును తీసుకున్నట్టే పచ్చి బొప్పాయిని కూడా ఆహారంగా తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.