Banana Flower Masala Curry : అరటి పువ్వుతో కూడా మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. అరటి పండు వలే అరటి పూలు కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అరటి పూలతో చేసే కూరను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అరటి పువ్వులతో రుచిగా, సులువుగా మసాలా కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అరటి పువ్వు మసాలా కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
అరటి పువ్వు – 1, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన టమాటాలు – 2, తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి ముక్కలు – గుప్పెడు, పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 4, గరం మసాలా – ఒక టీ స్పూన్, నానబెట్టిన చింతపండు – చిన్న నిమ్మకాయంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – అర టీ స్పూన్.

అరటి పువ్వు మసాలా కూర తయారీ విధానం..
ముందుగా అరటి పువ్వును తీసుకుని వాటి డొప్పలు తీస్తూ మధ్యలో ఉండే పువ్వులను సేకరించాలి. తరువాత ఒక్కో పువ్వును తీసుకుని వాటి మధ్యలో పొడవుగా ఉండే కాడను అలాగే పువ్వు పైన ఉండే ఒక పొరను తీసేసి మిగిలిన పువ్వును ప్లేట్ లోకి తీసుకోవాలి. చేతికి నూనె రాసుకుంటూ తీస్తే వీటిని చాలా సులభంగా వేరు చేసుకోవచ్చు. ఇలా అన్నింటిని సేకరించిన తరువాత కళాయిలో పల్లీలు వేసి వేయించాలి. తరువాత ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు వేసి మరో రెండు నిమిషాల పాటు వేయించాలి. తరువాత నువ్వులు వేసి ఒక నిమిషం పాటు వేయించి జార్ లోకి తీసుకోవాలి.
వీటిలో తగినన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తరువాత ముందుగా సేకరించిన అరటి పువ్వులను వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు బాగా వేయించాలి. తరువాత చింతపండు రసం, అర గ్లాస్ నీళ్లు పోసి కలపాలి.
తరువాత దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వరకు బాగా ఉడికించాలి. చివరగా కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అరటి పువ్వు మసాలా కూర తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అరటి పువ్వుతో ఈ విధంగా చేసిన కూరను తినడం వల్ల రుచితో పాటు అరటి పువ్వులను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు. ఈ కూరను అందరూ ఇష్టంగా తింటారు.