Sapota : మనం ఆరోగ్యంగా ఉండడానికి అనేక రకాల పండ్లను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వాటిలో సపోటా పండు కూడా ఒకటి. ఉష్ణ మండల ప్రాంతాలలో ఈ మొక్క ఎక్కువగా పెరుగుతుంది. స్పానిష్ సపోటా చెట్టు 30 నుండి 40 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. గాలికి తట్టుకోగలదు. కాండం తెల్లగా జిగురు కారుతూ ఉంటుంది. దీని ఆకులు ఒక్క రకమైన పచ్చ రంగులో మృదువుగా ఉంటాయి. సపోటా చెట్టు ఆకులు 7 నుండి 15 సెంటిమీటర్ల పొడవు ఉంటాయి. ఈ చెట్టు పువ్వులు గంట ఆకారంలో ఆరు రెక్కలను కలిగి ఉంటాయి. పచ్చి సపోటా కాయలను తినడం వల్ల నోరు ఎండిపోతుంది. గొంతు తడి ఆరిపోతుంది. పచ్చి కాయల్లో పాల వంటి లేటెక్స్ జిగురు ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ కాయలు చెట్టు మీద పండవు. ఇవి కోసిన తరువాతే పండుతాయి.
సపోటా చెట్టు ప్రతి భాగం నుండి పాలు వస్తాయి. సపోటా పండు ఎంత రుచిగా ఉంటుందో మనందరికీ తెలుసు. సపోటా పండ్లు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. సపోటా పండులో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. తాజా సపోటా పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. నీరసంగా ఉన్నప్పడు రెండు మూడు సపోట పండ్లను తినడం వల్ల తక్షణ శక్తి లభించి నీరసం తగ్గుతుంది. ఈ పండ్లల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక వీటిని తినడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. సపోటా పండ్లల్లో ప్రోటీన్స్, కొవ్వులు, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ బి6, ఫోలేట్, ఐరన్, పొటాషియం, కాపర్, మెగ్నిషియం వంటి వాటితోపాటు ఇతర పోషకాలు కూడా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
జీర్ణ క్రియ సాఫీగా సాగేలా చేయడంలో, మూత్ర పిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో, కంటి చూపును మెరుగుపరచడంలో, రక్త హీనత సమస్యను తగ్గించడంలో సపోటా పండ్లు ఎంతగానో సహాయపడతాయి. ఎదిగే పిల్లలకు వీటిని ఆహారంలో భాగంగా ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చురుకుగా ఉంటుంది. బరువు తక్కువగా ఉన్న వారు సపోటా పండ్లను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బాలింతలు ఈ పండ్లను తినడం వల్ల పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఎంతో రుచిగా ఉన్నాయని వీటిని ఎక్కువగా తినకూడదు. ఇలా తినడం వల్ల అజీర్తితోపాటు, కడుపు ఉబ్బరం సమస్య కూడా వస్తుంది.
గుండె జబ్బులతో బాధపడే వారు వీటిని వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి. సపోటా పండ్లను తినడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. సపోటా పండ్లను తేనెతో కలిపి తీసుకోవడం వల్ల పురుషులలో శీఘ్రస్కలనం తగ్గి శృంగార సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఈ విధంగా సపోటా పండ్లను తగిన మోతాదులో తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని, వీటిని తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.