Watermelon : వర్షాకాలంలో వైరస్, బాక్టీరియా వంటి సూక్ష్మజీవుల విజృంభణ ఎక్కువగా ఉంటుంది. చాలా మంది వీటి వల్ల కలిగే ఇన్ ఫెక్షన్ ల బారిన పడుతూ ఉంటారు. ఈ సూక్ష్మక్రిముల కారణంగా జలుబు, దగ్గు, నీళ్ల విరేచనాలు, వాంతులు, జ్వరం వంటి అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ఈ సమస్యల కారణంగా మనం నీరసానికి గురవడంతోపాటు శరీరం కూడా డీ హైడ్రేషన్ కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక మనం నీరసాన్ని తగ్గించి శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చే ఆహార పదార్థాలను తీసుకోవాలి. శరీరంలో నీటి శాతాన్ని పెంచే వాటిల్లో పుచ్చకాయ కూడా ఒకటి. ఇది మనకు వేసవి కాలంలో ఎక్కువగా దొరికేది. కానీ ప్రస్తుత తరుణంలో కాలంతో సంబంధం లేకుండా పుచ్చకాయ మనకు దొరుకుతోంది.
పుచ్చకాయకు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణం ఉంటుంది. పుచ్చకాయను తరచూ తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి జలుబు, దగ్గు వంటి ఇన్ ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాం. అంతేకాకుండా వాంతులు, నీళ్ల విరేచనాల కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. కనుక పుచ్చకాయను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల నీరసం తగ్గి, డీ హ్రైడేషన్ బారిన పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయను తినడం వల్ల మనం ఇతర ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు. పుచ్చకాయను తినడం వల్ల ఐరన్, సోడియం, పొటాషియం, మెగ్నిషియం వంటి మినరల్స్ మన శరీరానికి లభిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, మనల్ని రోజంతా చురుకుగా ఉంచడంలో పుచ్చకాయలు ఎంతగానో ఉపయోగపడతాయి.
పుచ్చకాయలకు పురుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచే గుణం కూడా ఉందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. పుచ్చకాయలను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల పురుషుల్లో శుక్రకణాల సంఖ్య, వాటి నాణ్యత కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మూత్ర పిండాలలో రాళ్ల సమస్యతో బాధపడే వారికి కూడా పుచ్చకాయ సహాయపడుతుంది. ఈ సమస్యతో బాదపడే వారు ప్రతి రోజూ పుచ్చకాయ జ్యూస్ ను తాగడం వల్ల లేదా పుచ్చకాయను నేరుగా తినడం వల్ల మంచి ఫలితం ఉంఉటందని, ఇతర మూత్ర పిండాల సమస్యలు కూడా రాకుండా ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
మలబద్దకం సమస్యతో బాధపడే వారు పుచ్చకాయను తినడం వల్ల మలబద్దకం సమస్య తగ్గడంతోపాటు జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అంతేకాకుండా వీటిని తినడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. పుచ్చకాయ గింజలలో కూడా శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఉంటాయి. పుచ్చకాయ గింజలను ఎండబెట్టుకుని తినడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. ఈ విధంగా పుచ్చకాయ మనకు ఎంతో సహాయపడుతుందని, దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనకు ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.