అవిసె గింజల పట్ల ప్రస్తుత తరానికి చాలా వరకు అవగాహన లేదు. కానీ మన పెద్దలు ఎప్పటి నుంచో వీటిని తింటున్నారు. అందువల్లే వారు ఆరోగ్యంగా జీవించగలుగుతున్నారు. నిజానికి అవిసె గింజలు సూపర్ ఫుడ్స్ జాబితా కిందకు చెందుతాయి. వీటిని నిత్యం తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలను తినడం వల్ల 37 క్యాలరీల శక్తి లభిస్తుంది. అలాగే ప్రోటీన్లు, పిండి పదార్థాలు, ఫైబర్, మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ బి1, బి6, ఫోలేట్, కాల్షియం, ఐరన్, మెగ్నిషియం, ఫాస్ఫరస్ తదితర పోషకాలు అధికంగా ఉంటాయి. అందువల్ల మన శరీరానికి పోషణ లభిస్తుంది. ఆరోగ్యంగా ఉండవచ్చు. అవిసె గింజల్లో ఉండే పోషకాల వల్ల రోజూ వీటిని తింటుంటే శరీరానికి శక్తి లభిస్తుంది. శరీరం దృఢంగా, బలంగా మారుతుంది. ఉక్కులా తయారవుతుంది.
అవిసె గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఈ గింజలను నిత్యం తింటే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు 14 శాతం వరకు తగ్గుతాయని 2.50 లక్షల మందిపై సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది.
అవిసె గింజల్లో లిగ్నన్స్ అనబడే వృక్ష సంబంధ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటాయి. దీని వల్ల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. నిత్యం అవిసె గింజలను తినే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 18 శాతం వరకు తగ్గుతాయని కెనడాకు చెందిన సైంటిస్టులు 6వేల మంది మహిళలపై చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. నిత్యం 30 గ్రాముల మోతాదులో అవిసె గింజలను తీసుకునే పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా ఉంటుందని సైంటిస్టులు వెల్లడించారు.
అవిసె గింజల్లో ఫైబర్ (పీచు పదార్థం) పుష్కలంగా ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజల్లో సుమారుగా 3 గ్రాముల వరకు ఫైబర్ లభిస్తుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా మలబద్దకం తగ్గుతుంది. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.
నిత్యం 30 గ్రాముల మోతాదులో అవిసె గింజలను తినడం వల్ల బీపీ తగ్గుతుందని కెనడాకు చెందిన సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. వారు నిత్యం 30 గ్రాముల మోతాదులో అవిసె గింజలను 6 నెలల పాటు కొందరికి తినమని చెప్పారు. తరువాత పరిశీలించగా వారిలో సిస్టోలిక్ బీపీ 10 ఎంఎంహెచ్‌జీ, డయాస్టోలిక్ బీపీ 7 ఎంఎంహెచ్‌జీ తగ్గుతుందని తేల్చారు. అందువల్ల హైబీపీ ఉన్నవారు నిత్యం అవిసె గింజలను తీసుకుంటే ఎంతగానో మేలు జరుగుతుంది.
టైప్ 2 డయాబెటిస్ అనేది ప్రస్తుతం పెద్ద సమస్యగా మారింది. చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు నిత్యం 10 నుంచి 20 గ్రాముల మోతాదులో అవిసె గింజలను లేదా వాటి పొడిని తినడం వల్ల వారిలో చక్కెర స్థాయిలు 8 నుంచి 20 శాతం వరకు తగ్గినట్లు సైంటిస్టులు గుర్తించారు. అందువల్ల అవిసె గింజలను తింటే డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.
అవిసె గింజల్లో ఉండే ఫైబర్ అధిక బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. ఈ గింజలను తినడం వల్ల ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఫలితంగా తక్కువ ఆహారం తీసుకుంటారు. దీంతో శరీరానికి క్యాలరీలు తక్కువగా అందుతాయి. ఈ క్రమంలో అధిక బరువును సులభఃగా తగ్గించుకోవచ్చు.
అవిసె గింజలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల రోగ నిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. దీంతో ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. కరోనా వంటి వైరస్‌ల నుంచి రక్షణ లభిస్తుంది.
అవిసె గింజలను నిత్యం 10 నుంచి 30 గ్రాముల మోతాదులో ఎవరికి సౌకర్యవంతంగా ఉండేవిధంగా వారు తీసుకోవచ్చు. ముందుగా కొద్దిగా తినడం ప్రారంభించాలి. అవసరాన్ని బట్టి మోతాదు పెంచవచ్చు. అయితే దేన్నయినా మితంగా తీసుకోవాలి కనుక ఈ గింజలను కూడా తక్కువ మోతాదులోనే తీసుకోవాల్సి ఉంటుంది. గింజలను తినలేని వారు వీటిని పొడిని వివిధ రకాలుగా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా ఆరోగ్యకరమైన ప్రయోజనాలే కలుగుతాయి.