మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల నట్స్‌లో పీకన్ నట్స్ ఒకటి. ఇవి మన దేశంలో అంతగా పాపులర్ కావు. వీటి గురించి చాలా మందికి తెలియదు. కానీ ఇవి కూడా మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఇవి చూసేందుకు అచ్చం వాల్ నట్స్ ను పోలి ఉంటాయి. పీకన్ నట్స్ తియ్యగా ఉంటాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. వాల్ నట్స్‌లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. పీకన్ నట్స్ ఎక్కువగా మెక్సికో, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో పండుతాయి.
పీకన్ నట్స్‌లో విటమిన్ ఎ, ఇ, జింక్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం, ఇతర పోషకాలు ఉంటాయి. అలాగే ఐరన్, ఫాస్ఫరస్, విటమిన్ బి6, ప్రోటీన్లు, ఫైబర్ కూడా ఈ నట్స్‌లో ఉంటాయి. అందువల్ల ఈ నట్స్ ను తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు.
గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు పీకన్ నట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ నట్స్‌లో కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి బీపీని నియంత్రిస్తాయి. ఈ నట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వు అయిన మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు ఉంటాయి. అందువల్ల మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. కాబట్టి గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
డయాబెటిస్ సమస్య ఉన్నవారు ఈ నట్స్ ను తీసుకుంటే గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. ఈ నట్స్ ను తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
పీకన్ నట్స్‌లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి వాపులను, నొప్పులను తగ్గిస్తాయి. దీంతో ఆర్థరైటిస్ బాధితులకు ఉపశమనం కలుగుతుంది. ఈ నట్స్‌లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. వీటిలో మెగ్నిషియం, కాల్షియం, జింక్ ఎక్కువగా ఉన్నందున ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
పీకన్ నట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువే. విటమిన్లు ఎ, ఇ లు యాంటీ ఆక్సిడెంట్లలా పనిచేస్తాయి. దీని వల్ల వ్యాధులు రాకుండా నివారించవచ్చు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అల్జీమర్స్, పార్కిన్సన్స్ ఉన్నవారికి మేలు జరుగుతుంది.