Rajma Seeds : ప్రస్తుత తరుణంలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. షుగర్ వ్యాధి బారిన పడిన వారిలో బలం, కండ పుష్టిగా లేకపోవడం, తరచూ నీరసంగా ఉండడం వంటి లక్షణాలను మనం గమనించవచ్చు. షుగర్ వ్యాధి గ్రస్తుల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా, నీరసం తగ్గడంతోపాటు, బలంగా, కండ పుష్టిగా ఉండడం కోసం వారు ప్రోటీన్ ఎక్కువగా, కార్బొహైడ్రేట్స్ వెంటనే రక్తంలో కలిసి చక్కెర స్థాయిలను పెంచకుండా ఉండే ఆహార పదార్థాలను ఆహారంగా తీసుకోవాలి. అలాంటి ఆహార పదార్థాలలో రాజ్మా గింజలు ఒకటి. తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రోటీన్ ను అందించే వాటిల్లో రాజ్మా గింజలు ఒకటి. షుగర్ వ్యాధి గ్రస్తులు రాజ్మా గింజలను ఆహారంగా తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి పెరగకుండా ఉండడమే కాకుండా నీరసం తగ్గి.. బలంగా, కండ పుష్టిగా తయారవుతారు.
100 గ్రా. ల రాజ్మా గింజలల్లో 20 గ్రా. ల ప్రోటీన్ ఉంటుంది. మాంసాహారం తినని వారు రాజ్మా గింజలను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీన్ లభిస్తుంది. షుగర్ వ్యాధి గ్రస్తులు కూడా రాజ్మా గింజలను ఆహారంగా తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి పెరగకుండా బలంగా, కండపుష్టిగా తయారవుతారు.100 గ్రా. ల రాజ్మా గింజలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనకు 300 క్యాలరీల శక్తి లభిస్తుంది. అలాగే 100 గ్రా. ల రాజ్మా గింజలల్లో 48 గ్రా. ల కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. మనం ఇతర ఆహార పదార్థాలను ఆహారంగా తీసుకున్నప్పుడు కార్బోహైడ్రేట్స్ రక్తంలో కలవడం వల్ల వెంటనే చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. రాజ్మా గింజలను ఆహారంగా తీసుకోవడం వీటిల్లో ఉండే లెక్టిన్స్ ప్రేగుల నుండి కార్బొహైడ్రేట్స్ ను వెంటనే రక్తంలో కలవకుండా నెమ్మదిగా రక్తంలో కలిసేలా చేస్తాయి.
అలాగే 100 గ్రా. ల రాజ్మా గింజలల్లో 16 గ్రా. ల పీచు పదార్థాలు(ఫైబర్) ఉంటాయి. వీటిల్లో ఉండే ఫైబర్ మనం తిన్న ఆహార పదార్థాలలో ఉండే కొవ్వును మలం ద్వారా బయటకు వచ్చేలా చేస్తుంది. దీంతో శరీరంలో కొవ్వు నిల్వలు పెరగకుండా ఉండడమే కాకుండా బరువు కూడా తగ్గుతారు. అంతే కాకుండా మనం తిన్న ఆహార పదార్థాలలో ఉండే కార్బొహైడ్రేట్స్ ను కూడా వెంటనే రక్తంలో కలవకుండా చేయడంలో ఈ గింజలల్లో ఉండే ఫైబర్ సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో లేనప్పుడు రాజ్మా గింజలను ఆహారంగా తీసుకోవడం వల్ల త్వరగా చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి.
పొటాషియం అధికంగా ఉండే వాటిల్లో రాజ్మా గింజలు ఒకటి. 100 గ్రా. ల రాజ్మా గింజలల్లో 1332 మిల్లీ గ్రాముల పొటాషియం ఉంటుంది. మన శరీరంలో ఎలక్ట్రోలైట్స్ ను అదుపులో ఉంచడంలో పొటాషియం ఎంతో సహాయపడుతుంది. ఎలక్ట్రోలైట్స్ అదుపులో ఉండడం వల్ల నీరసం తగ్గి రోజంతా చురుకుగా ఉండవచ్చు. శరీరంలో అధికంగా ఉండే ఉప్పును కూడా ఈ పొటాషియం బయటకు పంపిస్తుంది. వారానికి మూడు లేదా నాలుగు సార్లు రాజ్మా గింజలను ఆహారంగా తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి పెరగకుండా ఉంటుంది. నీరసం తగ్గి, బలంగా, కండ పుష్టిగా తయారు కావచ్చని నిపుణులు చెబుతున్నారు.
రాజ్మా గింజలు గట్టిగా, పెద్దగా ఉంటాయి. వీటిని 10 నుండి 12 గంటల పాటు నానబెట్టిన తరువాత ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన గింజలతో నేరుగా కూర చేయవచ్చు లేదా ఇతర కూరలల్లో, సలాడ్స్ వంటి వాటిలో కూడా వేసుకోవచ్చు. గర్భవతులు, బాలింతలు రాజ్మా గింజలను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది. బరువు పెరగాలనుకునే వారు, వ్యాయామాలు చేసే వారు, ఆటలు ఆడే వారు రాజ్మా గింజలను ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.