Boiled Chickpeas : మనం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో శనగలు కూడా ఒకటి. శనగలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. మనం వివిధ రూపాల్లో శనగలను ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. శనగలను ఉడికించి గుగిళ్లుగా, కూరగా చేసుకుని తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. శనగలను తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో శనగలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటిలో ఐరన్, జింక్, మాంగనీస్, పొటాషియం, మెగ్నిషియం వంటి మినరల్స్ తోపాటు శరీరానికి అవసరమయ్యే ఇతర పోషకాలు కూడా ఉంటాయి. శాకాహారం తినే వారు శనగలను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్స్ అన్నీ లభిస్తాయి. అంతేకాకుండా శనగల్లో ఫోలేట్, పీచు పదార్థాలు కూడా ఎక్కువగా ఉంటాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను బయటకు పంపించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరడంలో శనగలు మనకు ఎంతగానో ఉయోగపడతాయి.
అలాగే శనగలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడి అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. పాలకు సరిసమానమైన కాల్షియం శనగల్లో ఉంటుంది. తరచూ శనగలను ఆహారంగా తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. నీరసంగా ఉన్నప్పుడు శనగలను తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అధిక బరువుతో బాధపడే వారు శనగలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. శనగలను తినడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. తద్వారా మనం తక్కువ ఆహారాన్ని తీసుకుంటాము. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.
రక్త హీనత సమస్యతో బాధపడే వారు శనగలను ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య పెరిగి రక్త హీనత సమస్య తగ్గుతుంది. కనీసం వారానికి రెండు నుండి మూడు సార్లు శనగలను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన మలినాలు తొలగిపోవడమే కాకుండా మూత్ర పిండాల పనితీరు కూడా మెరుగుపడుతుంది. అంతేకాకుండా వీటిని తినడం వల్ల మూత్ర పిండాల్లో రాళ్ల సమస్య కూడా తగ్గుతుంది.
దురద, గజ్జి వంటి చర్మ వ్యాధులతో బాధపడే వారు శనగలను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. శనగలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల పలు రకాల క్యాన్సర్ ల బారిన పడకుండా ఉంటామని నిపుణులు తెలియజేస్తున్నారు. శనగల్లో ఉన్న ఔషధ గుణాలను గుర్తించిన మన పూర్వీకులు వీటిని శుభకార్యాల్లో వాయనంగా ఇవ్వడాన్ని అలవాటు చేశారు. ఈ విధంగా శనగలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని, వీటిని ఆహారంలో భాగంగా తప్పకుండా తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు.