Ash Gourd : మనలో చాలా మంది ఇంటికి దిష్టి తగలకుండా ఉండడానికి ఇంటి ముందు బూడిద గుమ్మడికాయను కడుతూ ఉంటారు. ఇంకొందరు బూడిద గుమ్మడి కాయతో వడియాలను తయారు చేస్తూ ఉంటారు. బూడిద గుమ్మడి కాయ ఇంటి ముందు కట్టుకోవడానికి, వడియాలను పెట్టుకోవడానికి తప్ప ఎందుకూ పని చేయదు అని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ బూడిద గుమ్మడి కాయలో మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలతోపాటు ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయి. దీనిని ఇంగ్లీష్ లో ఆష్ గార్డ్ అని, వింటర్ మిలన్ అని పిలుస్తారు.
బూడిద గుమ్మడి కాయలతో కూరలను, పప్పును, తీపి పదార్థాలను కూడా తయారు చేసుకోవచ్చు. బూడిద గుమ్మడి కాయ చాలా రోజుల వరకు పాడవకుండా తాజాగా ఉంటుంది. శరీరానికి బలాన్ని చేకూర్చడంలో, మగవారిలో వీర్య కణాల సంఖ్యను పెంచడంలో, అధిక బరువును తగ్గడంలో బూడిద గుమ్మడి కాయ ఎంతో సహాయపడుతుంది. అత్యంత ప్రసిద్దమైన ఆగ్రా పేడ అనే తీపి వంటకాన్ని బూడిద గుమ్మడికాయతోనే తయారు చేస్తారు. ఈ కాయను తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
మినప పప్పుతో లేదా పెసర పప్పుతో ఈ కాయను కలిపి కూరగా చేసి తినడం వల్ల శరీరానికి అమితమైన బలం చేకూరుతుంది. ఈ కాయతో పప్పును కూడా చేసుకోవచ్చు. బూడిద గుమ్మడి కాయ పైన ఉండే చెక్కును తీసి ముక్కలుగా కోసి ఒక గంట పాటు నీటిలో నానబెట్టి రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా కడిగి పప్పును కూరను తయారు చేయాలి. ఇలా చేసే పప్పు కూర చాలా రుచిగా ఉండడంతోపాటు ఆరోగ్యానికి కూడా మేలును చేకూర్చుతుంది.
బూడిద గుమ్మడి కాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అంతే కాకుండా కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, జింక్, సెలీనియం, కాపర్ వంటి మినరల్స్ తోపాటు విటమిన్ బి1, బి2, బి6 వంటి విటమిన్స్ కూడా ఉంటాయి. శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను తొలగించి ఆరోగ్యాన్ని కాపాడడంలోనూ బూడిద గుమ్మడి కాయ ఉపయోగపడుతుంది. జలుబు, ఫ్లూ వంటి వాటిని తగ్గించడంతోపాటు బీపీని నియంత్రించడంలో, తలనొప్పిని తగ్గించడంలో, కంటి చూపును మెరుగుపరచడంలో కూడా ఈ కాయ దోహదపడుతుంది.
బూడిద గుమ్మడి కాయను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. బూడిద గుమ్మడి కాయను గుజ్జుగా చేసి నిమ్మరసం, పెరుగుతో కలిపి తలకు రాయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. తనొప్పిని తగ్గించడంలో, నరాలకు బలాన్ని ఇవ్వడంలో, జీర్ణ శక్తిని పెంచడంలో, మానసిక స్థితిని మెరుగుపరచడంలో కూడా బూడిద గుమ్మడి కాయ తోడ్పడుతుంది. బూడిద గుమ్మడి కాయ రసాన్ని ముఖానికి రాసుకోవడం వల్ల ముఖంపై ఉండే మచ్చలు పోతాయని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.