Chama Dumpa : మనకు అందుబాటులో విరివిరిగా లభించే దుంపలల్లో చామ దుంప ఒకటి. చామ దుంప జిగురుగా ఉంటుంది. కనుక దీనిని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. చామ దుంపలలో పొటాషియం, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, మాంగనీస్, ఫైబర్ తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. మాంసాహారం తినే వారికి గుడ్డు వల్ల ఎన్ని పోషకాలు శరీరానికి లభిస్తాయో, శాకాహారులకు చామ దుంపలు తినడం వల్ల అన్నే పోషకాలు లభిస్తాయి. దీని వల్ల మన శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
బరువు తగ్గాలనుకునే వారికి చామ దుంపలు ఎంతగానో సహాయపడతాయి. చామ దుంపలను తినడం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. రక్తహీనతతో బాధపడే వారికి చామ దుంప ఎంతో మేలు చేస్తుంది. చామ దుంపల వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగు పడుతుంది. చామ దుంపలను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
హైబీపీని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చామ దుంప ఎంతో సహాయపడుతుంది. ఇతర దుంపల లాగా వీటిని కూడా కూరగా, పులుసుగా, వేపుడుగా చేసుకోవచ్చు. కానీ వీటిని తినడం వల్ల వాతం, ఒంటి నొప్పులు, ఎలర్జీలు, వాంతులు, వికారం, శరీరంలో అసౌకర్యంగా ఉండడం వంటి సమస్యలు వస్తాయని చాలా మంది భావిస్తారు. చామ దుంపల వల్ల ఎటువంటి దోషాలు కలగవు. చామ దుంప వండే విధానం, వాటికి వాడే పదార్థాల వల్ల శరీరంలో సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
చామ దుంపను పులుసులా చేసినప్పుడు మనం చింత పండు గుజ్జు, ఉప్పు, కారం, మసాలాలను ఎక్కువగా వాడుతూ ఉంటాం. వీటిని అధికంగా వాడడం వల్లే శరీరంలో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. చింత పండు గుజ్జుకు బదులుగా పచ్చి చింతకాయ గుజ్జును వాడడం వల్ల ఉప్పు, కారం తక్కువగా పడుతుంది. చామ దుంపలు నూనెను ఎక్కువగా పీల్చుకుంటాయి. కనుక చామ దుంపతో వేపుడు చేసినప్పుడు కొద్దిగా ఉడికించి నూనె, ఉప్పు, మసాలాలను తక్కువగా వేయాలి. ఇలా చేయడం వల్ల చామ దుంపను తిన్న తరువాత ఎటువంటి సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు.
షుగర్ వ్యాధి ఉన్న వారు చామ దుంపలను నిర్భయంగా తినవచ్చు. ఎందుకంటే ఈ దుంపల్లో జిగురు వంటి పదార్థం ఎక్కువగా ఉంటుంది. కనుక ఇది షుగర్ లెవల్స్‌ను పెరగనివ్వదు. కాబట్టి చామ దుంపలను షుగర్ ఉన్నవారు కూడా తినవచ్చు. ఇతర దుంపలలా కాదు. ఇక వీటిని తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయెజనాలే కలుగుతాయి తప్ప.. ఎటువంటి సమస్యలు రావని.. నిపుణులు చెబుతున్నారు.