Beetroot : మనం ఆహారంగా తీసుకునే దుంప జాతికి చెందిన కూరగాయల్లో బీట్ రూట్ కూడా ఒకటి. దీనిని ఎంత ఎక్కువగా తింటే అంత రక్తాన్ని ఇస్తుంది అన్న సంగతి మనందరికీ తెలిసిందే. చక్కటి రంగుతోపాటు దీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి. బీట్ రూట్ ను ఏవిధంగా తీసుకున్నా కూడా మనం ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. బీట్ రూట్ జ్యూస్ ను తాగితే శక్తి పెరిగి క్రీడా సామర్థ్యం మెరుగుపడుతుందనే కారణం చేత క్రీడాకారులు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ జ్యూస్ ను తాగడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. చర్మ సౌందర్యాన్ని పెంచడంలో, అలాగే శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ శాతాన్ని తగ్గించడంలో కూడా బీట్ రూట్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ట్రైగ్లిజరైడ్లు తగ్గడం వల్ల రక్తంలోని కొవ్వు కూడా తగ్గుతుంది. శరీరంలో సహజంగా హార్మోన్లు ఉత్పత్తి అవ్వడానికి కూడా బీట్ రూట్ సహకరిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బీట్ రూట్ ను తీసుకోవడం వల్ల అనేక రకాల వ్యాధుల బారిన పడకుండా ఉంటాం. బీట్ రూట్ లో ఔషధ గుణాలు ఉన్నప్పటికీ ఇది మన ఆరోగ్యానికి మేలే చేయాలనే నియమం ఏమీ లేదు. ఇన్ని సుగుణాలు ఉన్న ఈ బీట్ రూట్ మెరిసేదంతా బంగారం కాదు అనే నానుడిని నిజం చేస్తూ కొన్ని ప్రమాదాలను కూడా తెచ్చి పెడుతుందట. దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో అన్ని దుష్ర్పభావాలు కూడా కలుగుతాయి. బీట్ రూట్ ను అతిగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హెమోక్రొమాటోటిస్, విల్సన్ వ్యాధితో బాధపడే వారు బీట్ రూట్ ను ఎక్కువగా తీసుకోకకూడదు. దీని వల్ల శరీరంలో కాపర్, ఐరన్ నిల్వలు పేరుకుపోతాయట. హెమోక్రొమాటోటిస్ వ్యాధి అనగా శరీరంలో అధికంగా ఐరన్ నిల్వలు పేరుకుపోవడం. విల్సన్ వ్యాధి వల్ల శరీరం కాపర్ ను ఎక్కువగా కోల్పోకుండా ఉంటుందని చెబుతారు. బీట్ రూట్ లో ఐరన్, కాపర్ ఎక్కువగా ఉండడం వల్ల హెమోక్రొమాటోటిస్, విల్సన్ వ్యాధులను ఇది మరింత పెంచుతుంది. అలాగే కొంత మందిలో బీట్ రూట్ ను తినడం వల్ల మూత్రం ఎరుపు రంగులో రావడం, రక్తం మరింత ఎర్రబడడం వంటి ఇబ్బందులను కూడా ఎదుర్కుంటున్నారట. రక్తం మరింత ఎర్రబడడం సాధారణ సమస్యే అయినప్పటికి దీని కారణంగా వచ్చే దుష్ప్రభావాల చేత చాలా మంది కంగారు పడుతుంటారు.
బీట్ రూట్ ను తీసుకోవడం వల్ల కొంత మందిలో వికారంతోపాటు డయేరియా వ్యాధి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. బీట్ రూట్ యొక్క గాఢ సారాన్ని బీటైన్ అంటారు. కిడ్నీ సమస్యలతో బాధపడే వారు బీట్ రూట్ ను తీసుకోవడం మానేయాలి. అలాగే గర్భవతులు బీట్ రూట్ ను తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలను పాటించాలి. ఇది తల్లి, బిడ్డ ఆరోగ్యాలపై ప్రభావం చూపుతుంది. జంతువుల మీద చేసిన ప్రయోగాల ద్వారా ఎదిగే పిండం మీద బీటైన్ ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని తేలింది. అనవసర సమస్యలు వద్దనుకునే వారు బీట్ రూట్ ను పరిమితంగా తీసుకోవాలి. అధిక రక్తపోటుతో బాధపడే వారు బీట్ రూట్ ను తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కానీ ఇది అధిక రక్తపోటును నియంత్రించే మందులతో కలిసి శరీరంలో రక్తపోటు స్థాయిలను పరిమితికి మించి తగ్గించే అవకాశం ఉంటుంది. కనుక రక్తపోటుకు మందులను వాడే వారు బీట్ రూట్ ను జాగ్రత్తగా తీసుకోవాలి.
బీట్ రూట్ ను అధికంగా తీసుకోవడం వల్ల అది మన ఆరోగ్యానికి హానిని కలిగిస్తుంది. బీట్ రూట్ రసం శరీరంలో క్యాల్షియం స్థాయిలను తగ్గించి అనేక వ్యాధుల బారిన పడేలా చేసే అవకాశం ఉంటుంది. బీట్ రూట్ రసం తాగడం వల్ల గొంతులో బిగువుగా అనిపించి మాట్లాడడం కష్టం అవుతుంది. అలాగే ఈ రసాన్ని తాగడం వల్ల కొందరిలో జ్వరం, దద్దుర్లు, వణుకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి కనుక దీనిని తీసుకునే ముందు జాగ్రత్త పడాలి. ఈ దుష్ప్రభావాలు అన్నీ కూడా బీట్ రూట్ వల్ల కలిగే లాభాల ముందు చాలా చిన్నవి. కనుక బీట్ రూట్ ను తగిన మోతాదులో తీసుకుని ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవలసిందిగా నిపుణులు చెబుతున్నారు.