ఈ భూమిపై ఎన్నో వేల జాతుల పాములు ఉన్నాయి. వాటిలో కొన్ని పెద్దవిగా ఉంటే మరికొన్ని చిన్నవిగా ఉన్నాయి. కొన్ని విషం కలిగి ఉంటే, కొన్ని విషం లేనివిగా ఉన్నాయి. అయితే విషం లేని పాములను పక్కన పెడితే, విషం ఉన్న పాము ఏది కుట్టినా మనకు ప్రాణాలు పోవడం ఖాయం. సరైన సమయంలో స్పందించకపోతే మృత్యువు బాట పట్టాల్సిందే. అంతటి విషాన్ని పాములు కలిగి ఉంటాయి. అయితే విషం ఉన్న పాముల్లోనూ కొన్నింటి విషం మరీ డేంజర్‌గా ఉంటుంది. అలాంటి విషం ఉన్న పాములు కుడితే క్షణాల్లోనే మరణం సంభవిస్తుంది. అయితే విషం ఉన్న ఏ పాము కుట్టినా దాని ప్రభావాన్ని బట్టి వ్యక్తులు చనిపోవడమే లేదంటే ప్రాణాపాయ స్థితికి చేరుకుని అనంతరం చికిత్స వల్ల బతకడమో జరుగుతుంది. మరదే విషాన్ని మింగితే..? అప్పుడు ఆ వ్యక్తులు చనిపోతారా..? చనిపోవడమేమిటి… దెబ్బకే ప్రాణం పోతుంది..! అంటారా..! అయితే అలా కాదు. అవును, మీరు వింటున్నది నిజమే. పాము విషాన్ని మింగితే చనిపోరు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమేనట.
సాధారణంగా ఈ భూమిపై ఉన్న ఏ పాము అయినా 3 రకాల విషాలను కలిగి ఉంటుందట. అవి 1. హెమోటాక్సిక్ వీనమ్ (Hemotoxic venom). 2. సైటోటాక్సిక్ వీనమ్ (Cytotoxic venom). 3. న్యూరోటాక్సిక్ వీనమ్ (Neurotoxic venom). హెమోటాక్సిక్ విషం ఉన్న పాములు కుడితే ఆ విషం గుండెపై ప్రభావాన్ని చూపుతుందట. ఆ విషం రక్తనాళాల ద్వారా గుండెకు ప్రవహించి గుండెను వెంటనే ఆపేసినంత పనిచేస్తుందట. ఇక సైటో టాక్సిక్ విషం ఉన్న పాములు కుడితే శరీరంలో ఉన్న కండరాలు పక్షవాతం వచ్చినట్టు పడిపోతాయట. చివరిగా న్యూరో టాక్సిక్ విషం ఉన్న పాములు కుడితే శరీరంలోని నాడీ వ్యవస్థ దెబ్బ తింటుందట. ఫలితంగా మెదడు పనిచేయడం ఆగిపోయి ఆ వ్యక్తికి మరణం సంభవిస్తుందట. అయితే ఈ మూడింటిలో ఎలాంటి విషమైనా అది పాము కుట్టడం వల్ల రక్త నాళాల్లోకి నేరుగా ప్రవహించినప్పుడే పైన చెప్పిన సంబంధిత లక్షణాలు కనిపించి ఆ వ్యక్తులకు ప్రాణాపాయ స్థితి కలుగుతుంది. కానీ అవే విషాలను నోటితో మింగితే అప్పుడు నోట్లో ఉండే లాలాజలంతోపాటు, జీర్ణాశయంలోని పలు ఎంజైమ్స్, యాసిడ్లు ఆ విషాలను హరించి వేస్తాయట. దీంతోపాటు విష ప్రభావం శరీరంపై పడకుండా ఆ విషాలను హానిలేని రసాయనాలుగా మార్చేస్తాయట. అందుకే పాము విషాన్ని మింగినా మనకు ఏమీ కాదట. కానీ పాము కుట్టడం వల్ల ఆ విషం నేరుగా రక్త నాళాల్లోకి ప్రవహిస్తేనే ఇబ్బంది కలుగుతుందట.
పైన చెప్పిన విషయాన్ని అనుసరించే వియత్నాంకు చెందిన ఓ వ్యక్తి గత 20 ఏళ్లుగా పాము విషాన్ని నిత్యం కొంత మోతాదులో మింగుతున్నాడట. ఈ క్రమంలో అతను ఇప్పటికీ ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడట. అయితే శరీర రోగ నిరోధక వ్యవస్థ చాలా పటిష్టంగా ఉన్న వారు పాము విషాన్ని మింగితే ఆ విషాన్ని శరీరం శోషించుకుని, దానికి వ్యతిరేకమైన విరుగుడును తయారు చేసుకుంటుందట. ఈ క్రమంలో అలాంటి వారికి విషపు పాములు, కీటకాలు కుట్టినా ఏమీ జరగదట. కానీ శరీర రోగ నిరోధక వ్యవస్థ బాగా లేని వారు పాము విషాన్ని ఒక చుక్క తాగినా దాంతో తీవ్ర అనారోగ్యం కలుగుతుందట. ఏది ఏమైనా తెలిసి తెలిసీ ఎవరూ పాము విషాన్ని తాగరు కదా, అసలు దాన్ని ముట్టను కూడా ముట్టరు. ఎందుకంటే అది విషం కదా. దాని వల్ల ఎలాంటి ఆపద వస్తుందోనని భయం మరి. అందుకే అందరూ దానికి దూరంగా ఉంటారు.