మన దేశంలో భిన్న వర్గాలు, మతాలకు చెందిన ప్రజలు నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఒక్కో వర్గానికి చెందిన ప్రజలు తమ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను కూడా తూచా తప్పకుండా పాటిస్తుంటారు. ఇక ప్రాంతాల వారిగా కూడా కొందరు ప్రజలు పలు ఆచారాలను పాటిస్తుంటారు. ఇప్పుడు చెప్పబోతున్న గ్రామం కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఆ గ్రామానికి చెందిన వారందరూ ఎన్నో ఏళ్లుగా ఒక వింత ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు. అదేమిటంటే…
కర్నూల్ జిల్లాలోని కోడుమూరు మండలంలో ఉన్న వెంకటగిరి అనే గ్రామంలో నివాసం ఉండే ప్రజలు గత 400 ఏళ్లుగా వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. అదేమిటంటే.. ఆ ఊర్లో ఏ వ్యక్తి పేరులోనైనా సరే.. గిడ్డ అని ముందుగా ప్రారంభమవుతుంది. అవును, ఇది నిజమే. దీంతో ఆ గ్రామంలో చాలా మంది పేర్లు గిడ్డయ్య, గిడ్డమ్మ, గిడ్డా౦జనేయ, గిడ్డరెడ్ది, గిడ్డేయ్యసామి, రామ గిడ్డయ్య, సీత గిడ్డెమ్మ అని వినిపిస్తుంటాయి. అయితే ఇలా ఆ గ్రామస్తులు ఈ ఆచారం పాటించడం వెనుక ఒక కథ ఉందట. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
సుమారుగా 400 ఏళ్ల కిందట వెంకటగిరి గ్రామంలో కేవలం 4 ఇళ్లు మాత్రమే ఉండేవట. ఈ క్రమంలో ఒకసారి గ్రామానికి సమీపంలో ఉన్న హంద్రినీవా నదిని ఆ గ్రామస్తులు దాటుతుండగా.. నదిలో నుండి వారికి ఆంజనేయ స్వామి మాటలు వినిపించాయట. తాను నదిలో కూరుకుపోతున్నానని, బయటకు తీసి తనకు గుడి కట్టిస్తే గ్రామానికి మేలు జరుగుతుందని మాటలు వినిపించాయట. దీంతో ఆ గ్రామస్తులు నదిలో వెతికే సరికి ఆంజనేయ స్వామి విగ్రహం వారికి కనిపించిందట. ఈ క్రమంలో ఆయనకు గుడి కట్టి అప్పటి నుంచి ఆయన్ను పూజించడం మొదలు పెట్టారు.
అయితే ఆంజనేయ స్వామికి గుడి కట్టినప్పటి నుంచే అలా పైన చెప్పినట్లుగా ఆ గ్రామంలోని వారు తమ పేర్లకు ముందు గిడ్డ అని కలపడం మొదలు పెట్టారట. అలా ఆ ఆచారం అప్పటి నుంచి కొనసాగుతోంది. అయితే బిడ్డ పుట్టగానే ఆ గ్రామంలో గిడ్డ అని ముందుగా పేరుకు కలిపి ఆ తరువాత బిడ్డను ఆ పేరుతో పిలుస్తారట. లేదంటే బిడ్డ ఏడుపు ఆగదట. గిడ్డ అని పేరు ముందు కలపగానే బిడ్డ ఏడుపు ఆపుతుందట. ఇక ఆ గ్రామంలో గిడ్డయ్య అని పిలిస్తే చాలా మంది పలుకుతారట. అలాంటప్పుడు వారిని ఇంటి పేరుతో సహా పిలవాలట. అలాగే ఆ గ్రామంలో గిడ్డయ్య కట్ట అనే రచ్చబండ కూడా ఉంది. అక్కడే ఆ గ్రామస్తులు తమ సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇక ఆ గ్రామంలోని ప్రజలు తమ పిల్లలకు గిడ్డ అని కలిపి పేరు పెట్టకపోతే అరిష్టం జరుగుతుందని నమ్ముతారు. అందుకే అక్కడ ఈ వింత ఆచారం కొనసాగుతూ వస్తోంది..!