ప్రస్తుతం నడుస్తున్నది ఉరుకుల పరుగుల బిజీ జీవితం. ఈ పోటీ ప్రపంచంలో నెట్టుకు రావాలంటే.. మనమూ అంతే వేగంగా ముందుకు సాగాల్సి వస్తోంది. ఈ క్రమంలో అనేక సందర్భాల్లో మానసిక ఒత్తిడి, ఆందోళనలకు మనం గురవుతున్నాం. దీంతో కొందరికి డిప్రెషన్ కూడా వస్తోంది. ఈ స్థితికి చేరుకున్న వారిలో కొందరు బలవంతంగా ప్రాణాలను తీసుకుంటున్నారు. అయితే అలాంటి స్థితికి రాకుండా ఉండాలన్నా.. నిత్యం ఎలాంటి టెన్షన్లు లేకుండా హాయిగా జీవించాలన్నా.. కింద ఇచ్చిన పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో డిప్రెషన్ తగ్గుతుంది. మరి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. విటమిన్ డి
విటమిన్ డి మనకు ఎక్కువగా సూర్యరశ్మి వల్ల లభిస్తుంది. అలాగే కోడిగుడ్డు, నూనెలు, పుట్టగొడుగులు తదితర ఆహారాల వల్ల కూడా మనకు విటమిన్ డి దొరుకుతుంది. అయితే విటమిన్ డి ఉన్న ఆహారాలను తీసుకుంటే దాంతో శరీరంలో సెరటోనిన్ అనే హార్మోన్ పెరుగుతుంది. ఫలితంగా డిప్రెషన్ రాకుండా ఉంటుంది. కనుక విటమిన్ డి ఎక్కువగా ఉండే గుడ్లు, చీజ్, బీఫ్, నారింజ, చేపలు, సోయా పాలు తదితర ఆహారాలను తీసుకుంటే డిప్రెషన్ బారిన పడకుండా ఉండవచ్చు.
2. విటమిన్ బి6
డిప్రెషన్‌ను తగ్గించడంలో విటమిన్ బి6 కూడా చక్కగా పనిచేస్తుంది. విటమిన్ బి6 ఉండే పోర్క్, చికెన్, చేపలు, గోధుమ బ్రెడ్, బీన్స్, కూరగాయాలను తీసుకుంటే డిప్రెషన్ రాకుండా చూసుకోవచ్చు.
3. విటమిన్ బి3
మన శరీరంలో సెరటోనిన్ విడుదల అయ్యేందుకు విటమిన్ బి3 కూడా ఉపయోగపడుతుంది. కనుక ఈ విటమిన్ ఎక్కువగా ఉండే పుట్టగొడుగులు, పల్లీలు, పచ్చి బఠానీలు, చేపలు, టర్కీ కోడి మాంసం, బీఫ్ తదితర ఆహారాలను తింటే డిప్రెషన్ బారిన పడకుండా ఉండవచ్చు.
4. విటమిన్ బి 12
ఈ విటమిన్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల మానసికంగా శక్తివంతులుగా మారుతారని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. డిప్రెషన్ తగ్గుతుంది. మాంసం, లివర్, కిడ్నీ, చేపలు, పాలు, పాల సంబంధ పదార్థాలు, బీఫ్‌లలో విటమిన్ 12 మనకు పుష్కలంగా లభిస్తుంది.
5. విటమిన్ సి
విటమిన్ సి వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. డిప్రెషన్ తగ్గుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండే నారింజ పండ్లు, కివీ, బెర్రీస్, కాలిఫ్లవర్, బ్రొకొలి, టమాటా, పాలకూర, క్యాప్సికం తదితర ఆహారాలను నిత్యం తింటుంటే డిప్రెషన్ రాకుండా ఉంటుంది.
6. విటమిన్ ఇ, బి9
విటమిన్ ఇ ఎక్కువగా ఉండే పల్లీలు, హాజెల్ నట్స్, చేపలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, ఆకు కూరలు, బాదం పప్పు, కొబ్బరి నూనెలతోపాటు విటమిన్ బి9 ఉండే చిరు ధాన్యాలు, నట్స్, బీన్స్, బఠానీలు, అవకాడోలు, ఆకు కూరలు, పాలకూర, బెండకాయ, నిమ్మ తదితర ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా డిప్రెషన్ బారి నుంచి తప్పించుకోవచ్చు.