బ్రాండెడ్ షూస్ కొనాలంటే చాలు ఏదో ఒక షాపుకు లేదా బ్రాండెడ్ స్టోర్‌కు వెళ్లడం, రక రకాల మోడల్స్ చూడడం, నచ్చితే కొనడం, లేదంటే మరో షాపుకు వెళ్లడం మనకు అలవాటే. ఏ బ్రాండెడ్ కంపెనీకి చెందిన షూ అయినా దాదాపుగా రూ.1వేయి పై నుంచే మొదలవుతుంది. మంచి లెదర్, ఆకట్టుకునే స్టైల్‌తో తీర్చిదిద్దబడి తయారు చేసిన షూస్ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. కానీ మీకు తెలుసా..? ఆ ఖరీదైన షూ వెనుక ఉన్న కఠోర శ్రమ గురించి. అవును, ఆ షూస్‌ను తయారు చేసేది ఎవరో కాదు, మన దేశంలో, తమిళనాడులోని లెదర్ షూ కంపెనీల్లో పనిచేసే రోజు వారీ కార్మికులే. అందులోనూ వారు మహిళలు కావడం ఇందులో చెప్పుకోదగిన అంశం. వారి జీవితాల్లోకి ఒకసారి తొంగి చూస్తే వారు పడే అసలు కష్టం మనకు అర్థమవుతుంది.
తమిళనాడులోని వెల్లూర్, రాణీపేటలలో ఉన్న లెదర్ ఫుట్‌వేర్ పరిశ్రమల్లో కొన్ని వేల మంది మహిళలు రోజువారీ కార్మికులుగా పనిచేస్తున్నారు. నిత్యం పరిశ్రమకు వెళ్లడం, దొరికితే పనిచేయడం, వీలైనన్ని షూస్ జతలను తయారు చేయడం వారి పని. అయితే వారు అలా ఒక్క జత షూస్‌ను తయారు చేసినందుకు వారికి ఎంత జీతం చెల్లిస్తారో తెలుసా..? కేవలం రూ.5. అవును, మీరు విన్నది నిజమే. అయితే అదే జత షూస్‌ను మనం బయట మినిమం ఎంత డబ్బు పెట్టి కొంటాం..? కనీసం రూ.1వేయి నుంచి రూ.15 వందలైనా చెల్లిస్తాం. ఇంకా బ్రాండెడ్ అయితే దాని ధర ఇంకా ఎక్కువే ఉంటుంది. అలా ఆ మహిళలు రోజుకు వీలైనన్ని జతల షూస్‌ను తయారు చేస్తారు. యావరేజ్‌గా ఒక్కొక్కరు రోజుకు 16 జతల వరకు చేస్తారు. అయితే అన్నే జతల షూస్ మళ్లీ తరువాతి రోజు దొరుకుతాయా అంటే అదీ అనుమానమే. అసలు వారికి తరువాతి రోజు పని దొరుకుతుందో కూడా తెలియదు. ఇంత చేసినా వారి పనికి భద్రత లేదు. దీనికి తోడు లెదర్ ఫుట్ వేర్‌పై నిత్యం పనిచేయడం వల్ల వాటి ప్రాసెసింగ్ కోసం వాడే కెమికల్స్, వాటి నుంచి వచ్చే దుమ్ముతో ఆ మహిళలు చర్మ సంబంధ వ్యాధులు, దద్దుర్లు, కంటి ఇన్‌ఫెక్షన్స్, చేతుల్లో కదలిక లేకపోవడం, ఛాతి నొప్పి, శ్వాస కోశ సమస్యలు తదితర అనారోగ్యాలకు గురి కావల్సి వస్తోంది. ఇదీ… లెదర్ ఫుట్‌వేర్ పరిశ్రమల్లో పనిచేస్తున్న మహిళల దయనీయ స్థితి. వారి స్థితికి కారణం దళారులు, సబ్ కాంట్రాక్టర్లే అని చెప్పకనే తెలుస్తుంది.
అంతర్జాతీయ, జాతీయ ఫుట్‌వేర్ పరిశ్రమలలో పని కోసం కాంట్రాక్టర్లు టెండర్లు తీసుకుని వాటిని సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించడం, వారు వాటిని దళారులకు ఇవ్వడం, ఆ దళారులు కమిషన్ పేరుతో రోజువారీ మహిళా కార్మికులకు తక్కువ జీతం ఇవ్వడం అక్కడ సర్వ సాధారణంగా జరుగుతున్న విషయం. ఓ వైపు పనికి లేని భద్రత, మరో వైపు కొరవడిన ఆరోగ్య సదుపాయాలు, ఇంకో వైపు రెక్కాడితే గానీ డొక్కాడని ఇంటి పరిస్థితులు… వెరసి ఆ మహిళలు నిత్యం అత్యంత దయనీయ జీవితం అనుభవిస్తున్నారు. వారికి కనీస వేతనాలు గానీ, ఆరోగ్య సదుపాయాలు గానీ, ఇతరత్రా ప్రయోజనాలు గానీ కల్పించడకుండా దళారులు, సబ్‌కాంట్రాక్టర్లు, కాంట్రాక్టర్లు కుమ్మక్కవుతున్నారు. వీరి ఆగడాలను సంబంధిత ప్రభుత్వ అధికారులు గానీ, మంత్రులు గానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఓ వైపు లెదర్ ఫుట్ వేర్ పరిశ్రమలు, కాంట్రాక్టర్లు, దళారులు వేల కోట్ల రూపాయలను ఆ రంగం ద్వారా ఆర్జిస్తుంటే మరో వైపు వాటిలో పనిచేస్తున్న కార్మికుల జీవితాలు మాత్రం ఇప్పటికీ బాగుపడలేదు. ఇప్పటికైనా వారి గోడును పట్టించుకుని ఆ దిశగా మంత్రులు, అధికారులు పనిచేయాలి. లేదంటే వారి పరిస్థితి ఇంకా దుర్భరమయ్యే అవకాశం ఉంది.