Cotton Plant : మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు మన జీవితంతో పత్తి చెట్టు ఎంతగానో పెనవేసుకుంది. మన శరీరాన్ని వాతావరణ మార్పుల నుండి కాపాడుకోవడానికి మనం ధరించే దుస్తులను కూడా పత్తితోనే తయారు చేస్తారు. ఇతర చెట్ల లాగా పత్తి చెట్టు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. పత్తి చెట్టు వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీనిని సంస్కృతంలో కర్పసి, రక్త కర్పసి అని హిందీలో కఫాస్ అని పిలుస్తూ ఉంటారు. మనకు తెల్ల రంగు, పసుపు రంగు, ఎరుపు రంగు పువ్వులు పూసే పత్తి చెట్లు లభిస్తాయి. పత్తిచెట్టు బెరడును, శొంఠి పొడితో కలిపి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్న లేపనంగా రాయడం వల్ల వృషణాల వాపు తగ్గుతుంది. పెసరపప్పు, పాలు, చక్కెరలను కలిపి పాయసాన్ని చేయాలి. ఈ పాయసం ఉడికేటప్పుడు అందులో 3 గ్రాముల పత్తి పువ్వుల పొడిని వేసి ఉడికించి ఆ పాయసాన్ని తినడం వల్ల పురుషులలో వీర్య బలహీనత తగ్గుతుంది.
10 గ్రాముల పత్తి పువ్వులను ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా నలిపి వడకట్టి తగినంత కండ చక్కెరను కలిపి ఆ నీటిని రెండు భాగాలుగా చేసి రెండు పూటలా ఉన్మాద రోగులకు తాగిస్తూ ఉండడం వల్ల క్రమంగా వారి పిచ్చి చేష్టలు తగ్గి మామూలు స్థితికి వస్తారు. పత్తి ఆకును మెత్తగా నూరి లేదా పత్తిని కాల్చి ఆ బూడిదను పైన లేపనంగా రాస్తూ ఉండడం వల్ల గాయాలు తగ్గుతాయి. పత్తి వేరును పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. దీనిని ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో కలిపి సగం గ్లాస్ అయ్యే వరకు మరిగించి దానికి తగినంత కండచక్కెరను కలిపి కొద్ది కొద్దిగా తాగుతూ ఉండడం వల్ల మూత్రంలో మంట తగ్గుతుంది. వమిడి పత్తి ఆకులకు, దోరగా వేయించి న మిరియాలను కలిపి నూరి ఆ మిశ్రమాన్ని గజ్జలలో వచ్చే బిళ్లలపై ఉంచి అది ఊడిపోకుండా కట్టు కట్టాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా గజ్జలలో వచ్చిన బిళ్లలు తగ్గిపోతాయి.
ఎర్ర పత్తికాయలను దంచి ఆ మిశ్రమాన్ని వస్త్రంలో ఉంచి దానిని కళ్లు మూసి కళ్లపై 5 నిమిషాల పాటు ఉంచుకోవడం వల్ల కళ్ల పోటు తగ్గుతుంది. పమిడి పత్తి వేర్లను 100 గ్రాముల మోతాదులో తీసుకుని దంచి వాటిని 400 గ్రాముల నీటిలో వేసి సగం మిగిలే వరకు మరిగించి చల్లారే వరకు ఉంచాలి. స్త్రీలు ఈ నీటితో రోజంతా యోనిని కడుగుతూ ఉండడం వల్ల యోని బిగువుగా మారుతుంది. పమిడి పత్తి గింజలను చిన్న మంటపై వేయించి దంచి జల్లించి ఆ పొడిని నిల్వ చేసుకోవాలి. ఈ పొడితో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల దంతాల నొప్పులు తగ్గుతాయి. బహిష్టు ఆగిన స్త్రీలు 20 గ్రాముల పమిడి పత్తికాయలను తీసుకుని దంచి అర లీటర్ నీటిలో వేసి సగం అయ్యే వరకు మరిగించి దానికి 20 గ్రాముల పాత బెల్లాన్ని కలిపి రోజూ ఉదయం పరగడుపున తాగాలి. ఇలా తాగిన గంట వరకు ఏమీ తినకుండా ఉండాలి. ఇలా చేయడం వల్ల స్త్రీలల్లో ఆగిన బహిష్టు మరలా వస్తుంది. బహిష్టు ప్రారంభం కాగానే ఆ కషాయాన్ని తాగడం ఆపి వేయాలి.
నొప్పులు, వాపులు తగ్గడంలో కూడా పమిడి పత్తి చెట్టు ఉపయోగపడుతుంది. ఈ చెట్టు గింజలను నీటిలో నానబెట్టి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని రోజూ రాత్రి పడుకునే ముందు నొప్పులు, వాపులు ఉన్న చోట ఉంచి కట్టు కట్టి ఉదయాన్నే తీసివేయాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా వాపులు, నొప్పులు తగ్గుతాయి. ఈ పత్తి ఆకులను నూరి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని గవద బిళ్లలపై లేపనంగా రాస్తూ ఉండడం వల్ల క్రమంగా గవద బిళ్లలు తగ్గుతాయి. ఈ విధంగా పత్తి చెట్టును ఉపయోగించి మనం ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. కానీ ఈ పరిష్కారాలను ఆయుర్వేద నిఫుణుల పర్యవేక్షణలో మాత్రమే ఉపయోగించాలని వారు తెలియజేస్తున్నారు.