Malle Chettu : మనం పెరట్లో అనేక రకాల పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. మనం ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల మొక్కలలో మల్లె చెట్టు కూడా ఒకటి. మల్లె చెట్టు నుండి మనకు మల్లె పూలు వస్తాయి. మల్లె పూలు చక్కని వాసనను కలిగి ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టపడతారు. మల్లె పూల వాసన మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. చాలా మంది స్త్రీలు ఈ పూలను జడలో ధరించడానికి ఎంతో ఇష్టపడతారు. మల్లె చెట్లల్లో 40 రకాల జాతులు ఉన్నాయి. సౌందర్య సాధనాలలో కూడా మల్లె పూలను ఉపయోగిస్తారు. ఒత్తిడిని తగ్గించడంలో మల్లె పూలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంట్లో మల్లె చెట్టును పెంచుకోవడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
కంటి అలసటను తగ్గించడంలో మల్లెపూలు ఎంతగానో ఉపయోగపడతాయి. మల్లె పూలను కంటి రెప్పలపై ఉంచుకోవడం వల్ల కళ్ల అలసట తగ్గుతుంది. మల్లె పూలలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. చుండ్రు సమస్యతో బాధపడే వారు మల్లె పూలను నీడలో ఎండబెట్టి పొడిగా చేయాలి. ఈ పొడికి మెంతుల పొడిని కలిపి పేస్ట్ లా చేసి తలకు పట్టించి 20 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య త్వరగా నయం అవుతుంది. జుట్టు కూడా నిగారింపును సొంతం చేసుకుంటుంది.
కొబ్బరి నూనెలో మల్లెపూలను వేసి రాత్రంతా నానబెట్టి మరుసటి రోజూ ఆ నూనెను మరగబెట్టి వడకట్టి తలకు రాసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది. తాజా మల్లెపూలను పేస్ట్ లా చేసి ఆ పేస్ట్ కు పాలను కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి 15 నిమిషాల తరువాత చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం తెల్లగా మారుతుంది. అంతేకాకుండా తాజా మల్లె పూల నుండి తీసిన రసాన్ని, గులాబీ పువ్వుల నుండి తీసిన రసాన్ని, గుడ్డులోని పచ్చ పొనతో కలిపి ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత ముఖాన్ని కడుక్కోవడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది.
మల్లెపూలతో టీ ని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ టీ ని తాగడం వల్ల బీపీ, షుగర్ నియంత్రణలో ఉంటాయి. మెదడు చురుకుగా పని చేస్తుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మల్లె పువ్వులే కాకుండా మల్లె చెట్టు ఆకులు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ ఆకులు యాంటీ సెప్టిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. మల్లె ఆకులను దంచి గాయాలపై ఉంచడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. నోటిపూతతో బాధపడే వారు మల్లె చెట్టు లేత ఆకులను నమిలి పావు గంట సేపు నోట్లో ఉంచుకుని మంచి నీటితో పుక్కిలించి ఉమ్మి వేయడం వల్ల నోటిపూత తగ్గుతుంది.
నీటిలో మల్లె పూలనువేసుకుని వేడి చేసి ఆ నీటితో స్నానం చేయడం వల్ల శరీరం నుండి వచ్చే దుర్గంధం తగ్గి చక్కని సువాసన వస్తుంది. మల్లె చెట్టు ఆకులను, జాజికాయను కలిపి నూరి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవడం వల్ల ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు తగ్గుతాయి. మల్లె పూల నుండి తీసిన నూనెను వాడడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ముఖంపై మచ్చలను తగ్గించడంలో కూడా ఈ నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విధంగా మల్లె పూలు జడలో ధరించడానికి మాత్రమే కాకుండా మనకు ఔషధంగా కూడా పనికి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎటువంటి రసాయనాలు, పురుగు మందులు వేయకుండా పెంచిన మల్లె చెట్టును, మల్లె పూలను మాత్రమే ఔషధంగా ఉపయోగించాలని వారు చెబుతున్నారు.