Thungamusthalu : మన చుట్టూ ఉండే ప్రతి మొక్క ఏదో ఒక ప్రత్యేకతను, ఏదో ఒక ఔషధ గుణాన్ని కలిగి ఉంటుంది. వాటిలో ఉండే ఔషధ గుణాల గురించి తెలియక మనం చాలా మొక్కలను కలుపు మొక్కలుగా భావిస్తూ ఉంటాం. అలాంటి వాటిలో తుంగ గడ్డి కూడా ఒకటి. దీనిని తుంగ ముస్తలు, బద్ర ముస్తలు, నాగ ముస్తలు అని కూడా పిలుస్తారు. వరి పొలాలల్లో ఈ మొక్క ఎక్కువగా పెరుగుతుంది. నీరు ఎక్కువగా ఉన్న చోట ఈ మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. వీటిని మనం కలుపు మొక్కలుగా భావించి వీటిని నివారిస్తూ ఉంటాం. కానీ ఈ మొక్కలు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ తుంగ గడ్డిని ఆయుర్వేదంలో ఔషధంగా కూడా ఉపయోగిస్తారు.
ఈ తుంగ మొక్కలకు చెందిన గడ్డలను పగలగొడితే సువాసనను వెదజల్లుతాయి. తుంగ గడ్డలను ముక్కలుగా చేసి కొబ్బరి నూనెలో వేసి నానబెట్టి ఆ నూనెను తలకు రాసుకునే వారు. శరీరంలో ఉండే వేడిని తగ్గించడంలో ఈ గడ్డలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటి కషాయం చేదు, వగరు రుచులను కలిగి ఉంటుంది. తుంగ గడ్డల కషాయాన్ని మనం చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. ఈ గడ్డల పొడిని రెండు గ్లాసుల నీటిలో వేసి ఒక గ్లాస్ అయ్యే వరకు మరిగించి వడకట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల తుంగ గడ్డల కషాయం తయారవుతుంది. ఈ కషాయాన్ని తాగడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. రక్తం శుద్ధి అవుతుంది. తుంగ గడ్డల కషాయాన్ని తాగడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కామెర్ల వ్యాధి నయం అవుతుంది.
ఈ తుంగ గడ్డలను నూరి ఆ మిశ్రమాన్ని నుదుటికి రాసుకోవడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. బట్టతలపై వెంట్రుకలు వచ్చేలా చేసే శక్తి కూడా ఈ తుంగ గడ్డలకు ఉంటుంది. ఈ తుంగ గడ్డలను నూరి పేస్ట్ లా చేసి ఆ పేస్ట్ ను నువ్వుల నూనెలో వేసి చిన్న మంటపై నూనె మిగిలే వరకు మరిగించి వడకట్టి చల్లగా అయిన తరువాత నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను రోజుకు మూడు సార్లు బట్టతలపై రాసుకోవడం వల్ల వెంట్రుకలు తిరిగి వస్తాయి. ఈ నూనెను తలకు రాసుకోవడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
తుంగ గడ్డల పేస్ట్ ను చర్మానికి రాసుకోవడం వల్ల చర్మం నిగారింపును సొంతం చేసుకుంటుంది. ఈ పేస్ట్ ను పాలలో వేసుకుని మరిగించి తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చిన్న పిల్లలు విరేచనాలతో బాధపడుతుంటే వారికి పాలను ఇచ్చేటప్పుడు రొమ్ములకు ఈ తుంగ గడ్డల పేస్ట్ ను రాసి పాలను ఇవ్వడం వల్ల పిల్లల్లో విరోచనాలు తగ్గుతాయి. 3 గ్రాముల తుంగ గడ్డల పొడిని పాలలో వేసుకుని తాగడం వల్ల జలుబు, దగ్గు, డయేరియా వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ గడ్డల పొడిని నీటిలో వేసి కలిపి చర్మానికి లేపనంగా రాసుకుని స్నానం చేయడం వల్ల శరీరం సువాసనను వెదజల్లుతుంది.
బాలింతలలో పాల ఉత్పత్తిని పెంచడంలో కూడా తుంగ గడ్డలు ఉపయోగపడతాయి. వీటి పొడిని నీళ్లతో కలిపి రొమ్ములకు రాసుకుని అరగంట తరువాత కడిగేయాలి. ఇలా చేస్తుండడం వల్ల బాలింతలలో పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఒక గ్రాము తుంగ గడ్డల పొడిని ఒక గ్లాసు నీటిలో కలిపి రెండూ పూటలా తీసుకోవడం వల్ల రక్త విరేచనాలు తగ్గుతాయి. కీళ్ల వాపులతో బాధ పడే వారు 60 ఎంల్ తుంగ గడ్డల కషాయానికి ఒక టీ స్పూన్ అశ్వగంధ పొడిని కలుపుకుని రోజుకు మూడు పూటలా తీసుకోవడం వల్ల కీళ్ల వాపు తగ్గుతుంది. దగ్గుతో బాధపడే వారు తుంగ గడ్డల పొడికి మిరియాల పొడిని కలిపి తీసుకోవడం వల్ల దగ్గు తగ్గుతుంది. ఈ గడ్డల పేస్ట్ ను గాయాలపై రాయడం వల్ల గాయాలు తగ్గుతాయి. దీనిని లేపనంగా రాయడం వల్ల చర్మ వ్యాధులు తగ్గుతాయి. ఈ విధంగా కలుపు మొక్కగా భావించే తుంగ మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.