Billa Ganneru For Hair : మనం ఇంటి ముందు అందంగా ఉండడానికి రకరకాల పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. ఇలా పెంచుకునే మొక్కల్లో బిళ్ల గన్నేరు మొక్క కూడా ఒకటి. ఈ మొక్క మనందరికి తెలిసిందే. దాదాపుగా ఈ మొక్క ఎటువంటి సస్య సంరక్షణ చర్యలు తీసుకోకపోయిన దానంతట అదే పెరుగుతుంది. అలాగే బిళ్ల గన్నేరు పూలు మనకు వివిధ రంగుల్లో లభిస్తాయి. ఈ పూలు దాదాపుగా సంవత్సరం అంతా పూస్తూనే ఉంటాయి. దీనికి నిత్య పుష్పి, సదా పుష్పి అనే పేర్లు కూడా కలవు. ఈ మొక్క 7 నుండి 24 అంగుళాల పొడవు వరకు పెరుగుతుంది. అయితే దీనిని పూల మొక్కగానే చాలా మంది చూస్తారు. కానీ బిళ్ల గన్నేరు మొక్క కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుందని మనలో చాలా మందికి తెలియదు.
బిళ్ల గన్నేరు మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. బిళ్ల గన్నేరు మొక్కలో ఉండే ఔషధ గుణాల గురించి అలాగే దీని వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బీపీ, మధుమేహం , క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నయం చేయడంలో కూడా ఈ మొక్క మనకు ఉపయోగపడుతుంది. క్యాన్సర్ వ్యాధి గ్రస్తులకు, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని భావించే వారికి ఈమొక్క దివ్యౌషధంగా పని చేస్తుంది. క్యాన్సర్ కు తయారు చేసే మందుల్లో ఈ మొక్కను ఉపయోగిస్తారు. బిళ్ల గన్నేరు పూల పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ కమలా పండ్ల రసంలో కలుపుకుని తాగడం వల్ల క్యాన్సర్ బారిన పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.
ముక్కు నుండి రక్తం కారడం, చిగుళ్ల నుండి రక్తం కారడం, నోటిలో పుండ్లు, చర్మం పై దద్దుర్లు వంటి అనేక రకాల వ్యాధులను ఈ బిళ్ల గన్నేరు మొక్కను ఉపయోగించి నయం చేసుకోవచ్చు. బిళ్ల గన్నేరు ఆకులను నువ్వుల నూనెలో వేసి మరిగించాలి. తరువాత ఈ నూనెను వడకట్టి నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను కండరాలపై రాయడం వల్ల కండరాల నొప్పులు, వాపులు తగ్గుతాయి. షుగర్ వ్యాధితో బాధపడే వారు ఈ మొక్క వేరును సేకరించి రెండు గ్లాసుల నీటిలో వేసి ఒక గ్లాస్ అయ్యే వరకు బాగా మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని వడకట్టి అందులో మిరియాల పొడి వేసి కలుపుకుని తాగాలి. ఇలా క్రమం తప్పకుండా 45 రోజుల పాటు తాగడం వల్ల ఎంతో కాలంగా వేధిస్తున్న షుగర్ వ్యాధి అయినా నియంత్రణలోకి వస్తుంది.
ఈ కషాయాన్ని తాగడం వల్ల మూత్రపిండాల సమస్యలు కూడా తగ్గుతాయి. మొలల తో బాధపడే వారు బిళ్ల గన్నేరు పూలతో చేసిన కషాయంతో మొలలను కడుగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మొలల సమస్య తగ్గు ముఖం పడుతుంది. తెల్ల జుట్టు, జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడే వారు బిళ్ల గన్నేరు పూలను, ఆకులను సేకరించి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ లో పెరుగు, కొబ్బరి నూనె కలిపి జుట్టుకు ప్యాక్ లా వేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి ప్యాక్ లా వేసుకోవడం వల్ల జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది. జుట్టు పొడవుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ మొక్క ఆకులను పేస్ట్ గా చేసి పురుగులు, కీటకాలు కుట్టిన చోట రాయడం వల్ల నొప్పి, వాపు తగ్గుతుంది.
అంతేకాకుండా ఈ ఆకుల పేస్ట్ ను చర్మ సమస్యలు ఉన్న చోట లేపనంగా రాయడం వల్ల సమస్య తగ్గు ముఖం పడుతుంది. అంతేకాకుండా ఈ బిళ్ల గన్నేరు మొక్కకు రక్తాన్ని పలుచగా చేసే గుణం, జ్ఞాపకశక్తిని పెంచే గుణం కూడా ఉంది. అయితే ఈ మొక్కను గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు ఉపయోగించకుండా ఉండడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. బిళ్ల గన్నేరు మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని దీనిని వాడడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.