Budama Mokka : పొలాల గట్లు, పత్తి చేలలో ఎక్కువగా కనిపించే మొక్కలలో బుడమకాయ మొక్క ఒకటి. దీనిని బుడమ, బుడ్డ, కుంపటి, కుప్పంటి మొక్క అని కూడా పిలుస్తారు. ఈ మొక్కను సంస్కృతంలో మృధు కంచిక అని, హిందీలో బంధ ప్రియ అని పిలుస్తారు. ఈ బుడమ మొక్క కాయలు గాలి బుగ్గలలా ఉంటాయి. ఈ మొక్కను మనలో చాలా మంది చూసే ఉంటారు. పూర్వకాలంలో ఈ మొక్క కాయలను పిల్లలు తినేవారు. వాటితో ఆడుకునే వారు కూడా. ఉష్ణ మండల, ఉప ఉష్ణ మండల ప్రాంతాలలో ఈ మొక్క విస్తారంగా పెరుగుతుంది. దీనిని చాలా మంది కలుపు మొక్కగా భావిస్తారు. కానీ బుడమ మొక్క ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది.
ఆయుర్వేదంలో ఈ మొక్కను ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. అల్సర్, దగ్గు, బ్రోంకైటిస్, మూత్ర సంబంధిత సమస్యలు వంటి వ్యాధులను నయం చేయడంలో ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. బుడమ మొక్క కాయలను కొన్ని ప్రాంతాలలో కూరగా కూడా వండుకుని తింటారు. ఈ కాయలలో విటమిన్ సి తోపాటు పొటాషియం, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ వంటి మినరల్స్ ఉంటాయి. బుడమ మొక్క ఆకులను తలనొప్పిని తగ్గించడంలో ఉపయోగిస్తారు. ఈ మొక్క వేర్లతో చేసిన కషాయాన్ని తాగడం వల్ల షుగర్ వ్యాధి నయం అవడంతోపాటు బీపీ కూడా నియంత్రణలో ఉంటుంది. బుడమ మొక్క వేర్లను సేకరించి శుభ్రంగా కడిగి వాటిని మూడు గ్లాసుల నీటిలో వేసి ఒక గ్లాసు అయ్యే వరకు మరిగించి ఆ కషాయాన్ని వడకట్టుకుని రోజుకు ఒకసారి తాగాలి. ఈ విధంగా చేయడం వల్ల షుగర్ వ్యాధి నయం అవుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఈ మొక్క వేర్ల నుండి తీసిన రసాన్ని పొట్టపై లేపనంగా రాస్తారు. అంతేకాకుండా బుడమ మొక్క యాంటీ క్యాన్సర్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఈ మొక్క పండ్లను తినడం వల్ల పలు రకాల క్యాన్సర్ లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వీటిని తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మూత్ర సంబంధిత సమస్యలు నయం అవుతాయి. బుడమ మొక్క యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. వీటి ఆకులను ముద్దగా నూరి నొప్పులపై ఉంచి కట్టు కట్టడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కొన్ని ప్రాంతాలలో ఈ మొక్క ఆకులను ఉడికించుకుని కూడా తింటారు. ఈ విధంగా కలుపు మొక్కగా భావించే బుడమ మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.