Dusara Teega : పొలాల గట్లపై, చేనుకు వేసిన కంచెలకు అల్లుకుని పెరిగే తీగజాతికి చెందిన మొక్కలలో దూసర తీగ మొక్క కూడా ఒకటి. గ్రామాలలో ఈ మొక్క గురించి తెలియని వారు ఉండరు. మానవాళికి ఈ మొక్క వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ మొక్క తీగలు ఎంతో బలంగా ఉంటాయి. గ్రామాలలో వీటి తీగలతో కంచెలను, గడ్డి కట్టలను కడుతుంటారు. దూసర తీగ మొక్క ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. మనకు వచ్చే అనేక రకాల వ్యాధులను నయం చేయడంలో ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది.
కళ్ల సమస్యలను తగ్గించడంలో ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మొక్కను ఉపయోగించి కళ్లు మసకగా కనిపించడం, కళ్లు ఎర్రగా మారడం, కంటిలో మంటలు, కళ్ల నుండి నీరు కారడం వంటి సమస్యలను నయం చేసుకోవచ్చు. ఈ మొక్క ఆకులను మెత్తగా నూరి రసాన్ని తీసి పడుకునే ముందు కళ్ల రెప్పలపై రాసుకుని పడుకోవాలి. ఉదయాన్నే చల్లటి నీటితో కళ్లను కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల కంటి సమస్యలు తగ్గుతాయి.
దూసర తీగ ఆకులను ఉపయోగించి చర్మంపై వచ్చే దురదలను, దద్దుర్లను, మొటిమలను తగ్గించుకోవచ్చు. ఈ మొక్క ఆకుల రసాన్ని తీసి ఆ రసానికి కొద్దిగా నీటిని కలిపి చర్మంపై రాసుకోవడం వల్ల దురదలు, దద్దుర్లు, మొటిమలు తగ్గుతాయి.
నరాల బలహీనత సమస్యను తగ్గించడంలోనూ ఈ మొక్క ఎంతగానో సహాయపడుతుంది. ఈ మొక్క ఆకులను తీసుకుని వాటిని దంచి రసాన్ని తీయాలి. 2 టీ స్పూన్ల చొప్పున ఈ రసాన్ని తీసుకుని ఒక గ్లాస్ నీటిలో కలిపి రోజూ పరగడుపున తాగుతూ ఉండడం వల్ల నరాల బలహీనత సమస్య తగ్గుతుంది.
మనలో చాలా మంది అధిక వేడి సమస్యతో బాధపడుతుంటారు. శరీరంలో వేడిని తగ్గించడంలో కూడా ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మొక్క ఆకులను తీసుకుని కచ్చా పచ్చాగా దంచి నీటిలో వేసి 2 గంటల పాటు ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల నీరు కొద్దిగా జెల్ లా మారుతుంది. దీని నుండి ఒక టీ స్పూన్ జెల్ ను తీసుకుని దానికి కండ చక్కెర కలుపుకుని తినడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది.
షుగర్ వ్యాధి గ్రస్తులకు కూడా దూసర తీగ మొక్క ఆకులు ఎంతగానో మేలు చేస్తాయి. ఒక గుప్పెడు దూసర తీగ మొక్క ఆకులను తీసుకుని నీటిలో వేసి బాగా మరిగించి వడకట్టాలి. ఇలా వడకట్టగా వచ్చిన నీటిని రోజూ ఒక గ్లాస్ చొప్పున తాగుతూ ఉండడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల అధిక బరువు సమస్య నుండి కూడా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణసంబంధమైన సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఈ మొక్క ఆకులను రెండింటిని తీసుకుని శుభ్రంగా కడిగి నోట్లో వేసుకుని బాగా నమిలి మింగాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్, అజీర్తి వంటి జీర్ణ సంబంధమైన సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.