Wheat Biscuits : మనం గోధుమలను పిండిగా చేసి ఉపయోగిస్తూ ఉంటాం. ఈ గోధుమ పిండిని ఉపయోగించి చపాతీ, పుల్కా వంటి వాటిని తయారు చేసుకుని తింటూ ఉంటాం. గోధమలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనకు ప్రయోజనాలు కలుగుతాయి. బరువు తగ్గడంలో, చక్కెర వ్యాధిని నియంత్రించడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. గోధుమలను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల పలు రకాల క్యాన్సర్ లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
శరీరంలో మెటబాలిజంను పెంచడంలో, పిత్తాశయంలో రాళ్లు రాకుండా చేయడంలో కూడా గోధుమలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ గోధుమ పిండితో చపాతీ, పుల్కాలే కాకుండా ఎంతో రుచిగా ఉండే బిస్కెట్లను కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. మైదా పిండితో చేసిన బిస్కెట్లను తినడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. గోదుమ పిండితో చేసే బిస్కెట్లను తినడం వల్ల శరీరానికి ఎటువంటి హాని కలగదు. ఓవెన్ తో పనిలేకుండా గోధుమ పిండితో బిస్కెట్లను ఎలా తయారు చేసుకోవాలి.. వాటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమ పిండి బిస్కెట్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమ పిండి – ఒక కప్పు, ఉప్మా రవ్వ – ఒక కప్పు, ఎండుకొబ్బరి పొడి – అర కప్పు, తరిగిన బాదం పప్పు – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన పిస్తా – 2 టేబుల్ స్పూన్స్, బెల్లం తురుము – ఒక కప్పు, నీళ్లు – అర కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్, ఉప్పు – చిటికెడు, నెయ్యి – 3 లేదా 4 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రె కి సరిపడా.
గోధుమ పిండి బిస్కెట్స్ తయారీ విధానం..
ముందుగా ఉప్మా రవ్వను జార్ లో వేసి పౌడర్ లా చేసుకోవాలి. ఒక గిన్నెలో బెల్లం తురుమును వేసి నీళ్లను పోసి బెల్లం కలిగే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో గోధుమ పిండి, ఎండుకొబ్బరి పొడి, పౌడర్ లా చేసుకున్న ఉప్మా రవ్వ, యాలకుల పొడి, ఉప్పు, తరిగిన పిస్తా, బాదం లతోపాటు నెయ్యిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. తరువాత బెల్లాన్ని కరిగించిన నీటిని తీసుకుని కొద్ది కొద్దిగా పోసుకుంటూ చపాతీ పిండిలా కలిపి మూత పెట్టి 15 నిమిషాల పాటు కదిలించకుండా ఉంచాలి. ఇప్పుడు పిండిని తీసుకుని మరోసారి కలిపి పెద్ద ముద్దలుగా చేసుకోవాలి. మందపాటి పాలీథిన్ కవర్ లేదా ప్లేట్ మీద నూనె రాసి చపాతీ కర్రతో మందంగా ఉండేలా చపాతీలా వత్తుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెను కానీ, గ్లాస్ ను కానీ తీసుకుని బిస్కెట్ ఆకారంలో కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసుకున్న బిస్కెట్స్ పై ఫోర్క్ లేదా టూత్ పిక్ లతో డిజైన్ లను కూడా వేసుకోవచ్చు. ఇలా బిస్కెట్స్ అన్నీ కట్ చేసుకున్న తరువాత కళాయిలో నూనె వేసి కాగిన తరువాత కట్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ ను వేసి మధ్యస్థ మంటపై రెండు దిక్కుల ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని టిష్యూ పేపర్ ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే గోధుమ పిండి బిస్కెట్స్ తయారవుతాయి. ఈ బిస్కెట్స్ వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి. చల్లారే కొద్ది గట్టిపడతాయి. మూత ఉండే డబ్బాలో నిల్వ చేసుకోవడం వల్ల ఈ బిస్కెట్స్ నెలరోజుల వరకు తాజాగా ఉంటాయి. ఎప్పుడూ తినే మైదాపిండి బిస్కెట్స్ కు బదులుగా ఇలా గోధుమ పిండితో బిస్కెట్స్ ను చేసుకుని తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది.