Dushtapu Theega Mokka : పొలాల కంచెల వెంబడి,తోటల్లో, రోడ్లకు ఇరు వైపులా, చెట్లకు అల్లుకుని పెరిగే తీగ జాతి మొక్కల్లో దుష్టపు తీగ మొక్క కూడా ఒకటి. ఇది గ్రామాల్లో విరివిరిగా కనబడుతూ ఉంటుంది. దీనిని దుష్టపు చెట్టు, జుట్టుపాకు అని కూడా పిలుస్తారు. దీనిని సంస్కృతంలో ఉత్తమా రాణీ, కాకజంగ, కురూతక అని హిందీలో ఉత్తరణ్, గడారియా కి బెల్, జూటక్ అని పిలుస్తారు. ఈ మొక్క చూడడానికి తిప్ప తీగలాగా ఉంటుంది. ఈ మొక్క ఆకులు హృదయాకారంలో, పలుచగా ఉంటాయి. దుష్టపు తీగ మొక్కకు గుత్తులు గుత్తులుగా పూలు, ముళ్ల లాంటి కాయలు ఉంటాయి. ఈ కాయలు ఎండిపోయిన తరువాత వీటి నుండి దూది లాంటి విత్తనాలు వస్తాయి. అంతేకాకుండా దుష్టపు తీగ మొక్క ఆకులు, పూలు, కాయలు తెంపినప్పుడు పాల లాంటి ద్రవం కారుతుంది.
చాలా మంది ఈ మొక్కను పిచ్చి మొక్క అనుకుంటారు కానీ ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. దుష్టపు తీగ ప్రతి భాగం ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఆయుర్వేదంలో ఈ మొక్కను ఎంతోకాలంగా ఔషధంగా ఉపయోగిస్తున్నారు. విరోచనాలు, దగ్గు, ఉబ్బసం, ఆర్థరైటిస్, బ్రాంకటైజ్, ఫైల్స్, కాలేయ సమస్యలు, చర్మ సమస్యలు, గర్భాశయ సమస్యలను నివారించడంలో ఈ మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తేలు కాటుకు గురి అయినప్పుడు ఈ మొక్క వేరును నీటితో అరగదీసి ఆ మిశ్రమాన్ని కాటుకు గురి అయిన చోట ఉంచడం వల్ల విషం విరిగిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దగ్గు, ఉబ్బసం వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు దుష్టపు ఆకులను నీటిలో వేసి కషాయంలా చేసుకుని తాగాలి.
ఇలా చేయడం వల్ల దగ్గు, ఉబ్బసం వంటి శ్వాస సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ మొక్క ఆకులను నాలుగు గ్రాముల మోతాదులో తీసుకుని నెయ్యిలో వేయించి తినడం వల్ల పొట్టలో నులి పురుగుల సమస్య తగ్గుతుంది. కీళ్ల నొప్పులతో బాధపడే వారు దుష్టపు తీగ మొక్క ఒక దివ్యౌషధంగా పని చేస్తుంది. ఈ మొక్క ఆకుల నుండి తీసిన రసంలో కొద్దిగా అల్లం రసాన్ని కలిపి ప్రతిరోజూ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కీళ్ల నొప్పలు త్వరగా తగ్గుతాయి. ఈ మొక్క ఆకుల రసం నుండి తీసిన రసంలో రాళ్ల ఉప్పును వేసి ఉప్పు కరిగే వరకు కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండు లేదా మూడు చుక్కల మోతాదులో చెవిలో వేసుకోవడం వల్ల చెవి నుండి చీము కారడం, చెవి నుండి వాసన రావడం, చెవి నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.
అదే విదంగా స్త్రీలల్లో వచ్చే అన్ని రకాల గర్భాశయ దోషాలను నివారించే గుణం కూడా ఈ దుష్టపు తీగ మొక్కకు ఉంది. ఈ మొక్క వేరును సేకరించి ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో మజ్జిగలో లేదా పెరుగులో కలిపి బహిష్టు వచ్చిన మొదటి రోజు నుండి ఐదు రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల గర్భాశయ దోషాలు తొలగిపోయి చక్కటి సంతానం కలుగుతుంది. దుష్టపు తీగ వేరులో ఒక మిరియాన్ని వేసి బాగా దంచాలి. ఇలా దంచగా వచ్చిన మిశ్రమాన్ని ఉండలుగా చేసి పిప్పి పన్ను పై ఉంచాలి. ఇలా చేయడం వల్ల పిప్పి పన్ను వల్ల కలిగే నొప్పి తగ్గుతుంది. ఈ విధంగా దుష్టపు తీగ మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని ఉపయోగించడం వల్ల మనం చక్కటి ఆరగో్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.