Kondapindi Aaku : మనలో చాలా మంది మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుందనే చెప్పవచ్చు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి అనేక కారణాలు ఉంటాయి. శరీరంలో క్యాల్షియం, ఆక్సలేట్స్, యూరిక్ యాసిడ్ వంటి పదార్థాలు అలాగే విష పదార్థాలు, వ్యర్థ పదార్థాలను మూత్రపిండాలు మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. శరీరంలో వీటి పరిమాణం ఎక్కువైనప్పుడు ఇవి మూత్రపిండాల్లో చిన్న చిన్న స్ఫటికాలుగా ఏర్పడతాయి. ఈ స్ఫటికాలకు ఇతర వ్యర్థ పదార్థాలు తోడవడం వల్ల అవి క్రమంగా రాళ్ల లాగా మారతాయి. నీటిని తక్కువగా తాగడం, క్యాల్షియం ట్యాబ్లెట్లను వాడడం, ఇతర అనారోగ్య సమస్యలకు మందులు వాడడం, మద్యపానం, ధూమపానం, మారిన మన జీవన విధానం వంటి వాటిని ఈ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.
మూత్రపిండాల్లో రాళ్ల వల్ల విపరీతమైన నొప్పి, బాధ కలుగుతుంది. అలాగే జ్వరం, వాంతులు, ఆకలి లేకపోవడం, మూత్ర విసర్జన సమయంలో నొప్పి, మంట వంటి ఇతర సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది. కనుక ఈ సమస్యను ముందుగానే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. లేదంటే మూత్రపిండాల్లో రాళ్ల పరిమాణం పెరిగిపోతుంది. దీంతో వాటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించాల్సి ఉంటుంది. శస్త్రచికిత్సతో అవసరం లేకుండా మూత్రపిండాల్లో రాళ్లను మనం చక్కటి ఆయుర్వేద చిట్కా ద్వారా తొలగించుకోవచ్చు. ఈ చిట్కాను వాడడం చాలా సులభం. అలాగే దీనిని వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు. మూత్రపిండాల్లో రాళ్లను తొలగించే ఆ ఆయుర్వేద చిట్కా ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మూత్రపిండాల్లో రాళ్లను తొలగించడంలో కొండపిండి ఆకు మనకు చక్కటి ఔషధంలా పని చేస్తుంది.
ఇది మనకు గ్రామాల్లో ఎక్కడపడితే అక్కడ దొరుకుతుంది. దీనిని కొన్ని ప్రాంతాల్లో తెలగపిండి ఆకు అని కూడా పిలుస్తారు. అలాగే దీనిని సంస్కృతంలో పాషాఫభేది అని పిలుస్తారు. కొండపిండితో ఆకుతో పప్పును కూడా వండుకుని తింటారు. కొండపిండి ఆకుతో పప్పును వండుకుని తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు ఈ మొక్కను ఉపయోగించడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. కొండపిండి ఆకులను సేకరించి వాటిని ఎండబెట్టాలి. తరువాత మెత్తని పొడిగా చేసుకుని నిల్వ చేసుకోవాలి. రోజూ ఈ పొడిని 2 టీ స్పూన్ల మోతాదులో అర గ్లాస్ నీటిలో కలిపి ఉదయాన్నే పరగడుపున తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు క్రమంగా కరిగిపోతాయి.
అలాగే ఈ ఆకులతో కషాయాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. కొండపిండి ఆకులను శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించాలి. వీటిని 10 నిమిషాల పాటు బాగా మరిగించిన తరువాత వడకట్టుకుని గోరు వెచ్చగా అయిన తరువాత తాగాలి. ఇలా పరగడుపున 20 రోజుల పాటు తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈ మొక్క ఆకులను నేరుగా కూడా నమిలి తినవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ చిట్కాను పాటిస్తూనే రోజూ 4 నుండి 5 లీటర్ల నీటిని తాగాలి. క్యాల్షియం ఎక్కువగా పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. ఉప్పును కూడా తక్కువగా తీసుకోవాలి. ఈ విధంగా ఈ చిట్కాను పాటించడం వల్ల చాలా సులభంగా మూత్రపిండాల్లో రాళ్ల సమస్య నుండి బయటపడవచ్చు.