Micro Greens : మొలకెత్తిన గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ప్రస్తుత కాలంలో మొలకెత్తిన గింజలను ఆహారంగా తీసుకునే వారి సంఖ్య పెరుగుతుందని చెప్పవచ్చు. మొలకెత్తిన గింజలతో పాటు మనం మైక్రో గ్రీన్స్ ను కూడా ఆహారంగా తీసుకోవచ్చు. మొలకెత్తిన గింజలను నాలుగు నుండి ఐదు రోజుల పాటు అలాగే ఉంచితే వాటి నుండి వచ్చిన మొలక పొడుగ్గా పెరగడంతో పాటు వాటికి ఆకులు కూడా వస్తాయి. వీటినే మైక్రో గ్రీన్స్ అంటారు. మైక్రో గ్రీన్స్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల కూడా మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుత కాలంలో మైక్రో గ్రీన్స్ ను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా వీటికి డిమాండ్ బాగా పెరిగింది. మార్కెట్ లో కూడా మైక్రో గ్రీన్స్ ను విరివిరిగా అమ్ముతున్నారు. రెస్టారెంట్ లలో కూడా ఈ మైక్రో గ్రీన్స్ తో వంటకాలను తయారు చేస్తున్నారు. అలాగే ఈ మైక్రో గ్రీన్స్ ను పశువులకు కూడా ఆహారంగా ఇస్తూ ఉన్నారు. ఈ మైక్రో గ్రీన్స్ ను తీసుకోవడం వల్ల మనం తక్కువ ఖర్చులో ఎక్కువ లాభాలను పొందవచ్చు. తోటకూర, పెసర్లు, మెంతులు, రాగులు, జొన్నలు, గోధుమలు ఇలా రకరకాల విత్తనాలను మనం మైక్రో గ్రీన్స్ గా తయారు చేసుకోవచ్చు. మైక్రో గ్రీన్స్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్యకరమైన లాభాలను పొందవచ్చు. విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ బి 9, ల్యూటిన్, జియోజ్గాంథిన్, బీటా కెరోటీన్ వంటి అనేక రకాల పోషకాలు వీటిలో పుష్కలంగా ఉంటాయి. మైక్రో గ్రీన్స్ ను మనం పోషకాల గని అని చెప్పవచ్చు.
100 గ్రాముల మైక్రో గ్రీన్స్ లో విటమిన్ సి 13 నుండి 50 మిల్లీ గ్రాములు, బీటా కెరోటీన్ 1 మిల్లీ గ్రాము నుండి 7.7 మిల్లీ గ్రాములు, విటమిన్ ఇ 3 మిల్లీ గ్రాముల నుండి 40 మిల్లీ గ్రాములు, విటమిన్ కె 1 మిల్లీ గ్రాము నుండి 3 మిల్లీ గ్రాములు, ఫోలిక్ యాసిడ్ 100 నుండి 200 మైక్రో గ్రాములు, ఫైబర్ 30 నుండి 40 శాతం మోతాదులో ఉంటాయి. ఈ మైక్రో గ్రీన్స్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల అన్ని రకాల పోషకాలను శరీరానికి అందించవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. వృద్ధాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది. ఈ మైక్రో గ్రీన్స్ ను ఇంట్లో తయారు చేసుకుని సలాడ్స్, సాండ్ విచ్ వంటి వాటితో కలిపి తింటే మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.