చాలా మంది మునగకాయలను కూరగా లేదా పప్పుచారులో వేసి వండుకుని తింటుంటారు. కానీ నిజానికి మునగకాయల కన్నా మునగాకులు ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. అనేక అనారోగ్యాలను తరిమికొడతాయి. మునగాకులను తినేందుకు చాలా మంది ఇష్ట పడరు. కానీ వీటిని రోజూ తినవచ్చు. కూరగా చేసుకుని తినలేని వారు రోజూ ఉదయాన్నే ఒక కప్పు మోతాదులో మునగాకుల జ్యూస్‌ను తాగవచ్చు. ఈ జ్యూస్‌ను రోజూ పరగడుపునే తాగడం వల్ల ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. అధిక బరువు సమస్య ఉన్నవారికి మునగాకుల జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ మునగాకుల జ్యూస్‌ను పరగడుపునే తాగితే శరీరంలోని కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. పొట్ట దగ్గరి కొవ్వు కూడా కరిగిపోతుంది.
2. మునగాకుల్లో అనేక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. దీంతో క్యాన్సర్లు రావు. శరీరానికి సదరు యాంటీ ఆక్సిడెంట్లు తక్షణ శక్తిని అందిస్తాయి. దీంతో యాక్టివ్‌గా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు.
3. శరీరంలో రోజూ విష పదార్థాలు, వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. వాటిని బయటకు పంపేందుకు మునగాకుల జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరం కడిగేసినట్లు అంతర్గతంగా క్లీన్ అవుతుంది. శరీరం సౌకర్యవంతంగా, హాయిగా, లైట్‌గా అనిపిస్తుంది. అందువల్ల రోజూ మునగాకుల జ్యూస్‌ను తాగాలి.
4. మునగాకుల జ్యూస్‌లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. విటమిన్ ఎ లోపం ఉన్నవారు ట్యాబ్లెట్లను వాడాల్సిన పనిలేదు. ఈ జ్యూస్‌ను రోజూ తాగితే చాలు, విటమిన్ ఎ సరిగ్గా లభిస్తుంది. దీంతో కంటి చూపు మెరుగు పడుతుంది. దృష్టి లోపం తగ్గుతుంది. జుట్టు, చర్మం, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
5. మునగాకుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక జీర్ణ సమస్యలు ఉండవు. మలబద్దకం, గ్యాస్, అసిడిటీ, అజీర్ణం తగ్గుతాయి. వాపులను తగ్గించే గుణాలు మునగాకుల్లో ఉంటాయి. అందువల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
6. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు రోజూ మునగాకుల జ్యూస్‌ను తాగుతుంటే చక్కగా నిద్ర పడుతుంది. గాఢ నిద్రలోకి జారుకుంటారు.
7. మునగాకుల జ్యూస్‌ను రోజూ తాగితే శరీరానికి ప్రోటీన్లు, కాల్షియం లభిస్తాయి. దీంతో ఎముకలు బలంగా మారుతాయి. ఎముకల్లో మజ్జ పెరుగుతుంది. వృద్ధులకు ఇది ఎంతగానో మేలు చేస్తుంది. కీళ్ల నొప్పులు తగ్గి కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. మెడ, ఒళ్లు నొప్పులు తగ్గుతాయి.