Punarnava Plant : అనేక ఔషధ గుణాలు కలిగి ఉన్న మొక్కలల్లో తెల్ల గలిజేరు మొక్క ఒకటి. దీనిని పునర్నవ, కటిలక, విషాది, శోభాగ్ని అని కూడా పిలుస్తూ ఉంటారు. మనకు ఎర్ర గలిజేరు, తెల్ల గలిజేరు అని రెండు రకాల మొక్కలు లభిస్తున్నాయి. కానీ తెల్ల గలిజేరు ఎంతో ఉత్తతమమైదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మన శరీరంలో అనారోగ్యానికి గురి అయిన అవయవాన్ని నయం చేసి మళ్లీ ఆరోగ్యాన్ని ఇస్తుంది. కనుక ఈ మొక్కకు పునర్నవి అనే పేరు వచ్చింది. ఈ మొక్క వేరు అమృతంతో సమానమైనదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్క ఆకులు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి.
విరేచనాలను తగ్గించడంలో, వ్రణాలను తొలగించడంలో, ఆకలిని పెంచడంలో, చర్మ వ్యాధులను తగ్గించడంలో ఈ మొక్క ఎంతో సహాయపడుతుంది. మనకు వచ్చే వాత, కఫ అనారోగ్య సమస్యలను తగ్గించడంలో తెల్ల గలిజేరు మొక్క ఎంతో ఉపయోగపడుతుంది. ఈ మొక్కకు రక్తాన్ని శుద్ధి చేసే శక్తి కూడా ఉంది. అన్ని రకాల శ్వాస కోస సంబంధమైన సమస్యలతోపాటు ఉబ్బురోగం, గుండె నొప్పిని కూడా ఈ మొక్కను ఉపయోగించి తగ్గించుకోవచ్చు. స్త్రీలలో వచ్చే గర్భాశయ సంబంధిత సమస్యలను తగ్గించి నెలసరి సరిగ్గా వచ్చేలా చేయడంలో కూడా ఈ మొక్క తోడ్పడుతుంది.
మూత్రాశయ సంబంధిత సమస్యలను తగ్గించి మూత్రం సరిగ్గా వచ్చేలా చేయడంతోపాటు మూత్ర పిండాలలో ఉన్న రాళ్లను కరిగించడంలోనూ ఈ మొక్క దోహదపడుతుంది. ఈ మొక్క ఆకుల రసాన్ని వాడడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ ఆకుల రసాన్ని వాడడం వల్ల ఎలాంటి జబ్బునైనా ఎదుర్కొనే శక్తి మనకి లభిస్తుంది. ఈ మొక్క ఆకులతో కూరలను, పప్పును కూడా తయారు చేసుకుని తినవచ్చు. మనకు జూలై నుండి నవంబర్ మధ్య కాలంలో ఈ మొక్క ఎక్కువగా లభిస్తుంది. దీనిని వీలైనన్ని సార్లు తెచ్చుకుని కూరగా చేసుకుని తినవచ్చు. ఆయుర్వేద షాపులలో ఈ మొక్క ఆకులతో చేసిన పొడి లభిస్తుంది. అలాగే ఆన్‌లైన్‌లోనూ దీన్ని కొనవచ్చు. ఈ పొడిని ఉపయోగించి కూడా మనకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.