Holy Basil : ఈ భూమి మీద ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఉన్నాయి. వాటిల్లో తులసి మొక్క కూడా ఒకటి. తులసి మొక్క మనందరికీ తెలిసిందే. ఈ మొక్కను మనం దేవతగా భావించి నిత్యం పూజిస్తూ ఉంటాం. తులసి ఆకుల్లో ఎన్నో ఔషధ విలువలు ఉంటాయి. ఆయుర్వేద వైద్యులు పలు రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఔషధంగా దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. పలు రకాల ఔషధాల తయారీలో, సౌందర్య సాధనాల తయారీలో తులసి ఆకులను విరివిరిగా ఉపయోగిస్తున్నారు. తులసి ఆకులను తీసుకోవడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రతిరోజూ ఉదయం పరగడుపున గుప్పెడు తులసి ఆకులను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని వారు చెబుతున్నారు. తులసి ఆకులను తినడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తరచూ జలుబు, దగ్గు వంటి వాటితో బాధపడే వారు తులసి ఆకులను తినడం వల్ల ఆయా సమస్యల నుండి సత్వరమే ఉపశమనం కలుగుతుంది. ఇలా తులసి ఆకులను తినడం వల్ల గుండెకు ఎంతో మేలు కలుగుతుంది. తులసి ఆకులను నేరుగా తినలేని వారు ఆ ఆకులను దంచి వాటి నుండి రసాన్ని తీయాలి. ఈ రసంలో తేనెను కలిపి తీసుకోవడం వల్ల కూడా మనకు అంతే మేలు కలుగుతుంది. ఇలా తేనె కలిపిన తులసి ఆకుల రసాన్ని చిన్న పిల్లలకు కూడా ఇవ్వవచ్చు.

మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారికి తులసి ఆకులు దివ్యౌషధంగా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. తులసి ఆకుల రసంలో తేనెను కలిపి తరచూ తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని మూత్ర పిండాల్లో రాళ్లు కూడా కరిగిపోతాయని వారు తెలియజేస్తున్నారు. కొందరు తీవ్రమైన దగ్గుతో బాధపడుతూ ఉంటారు. మందులు వాడినప్పటికీ తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలుగుతుంది. అలాంటి వారు తులసి ఆకులను తీసుకోవడం వల్ల చక్కని ఫలితం ఉంటుంది. తులసి ఆకులను మెత్తగా పేస్ట్ గా చేసి అందులో తేనెను, మిరియాల పొడిని కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతటి తీవ్రమైన దగ్గు అయినా తగ్గుతుంది.
తులసి ఆకులను ఉపయోగించడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. చర్మం కాంతివంతంగా, యవ్వనంగా కనబడుతుంది. చర్మ సంబంధిత సమస్యలతో బాధపడే వారు తులసి ఆకులను పేస్ట్ గా చేసి దానిలో నిమ్మరసాన్ని, చిటికెడు పసుపును వేసి కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి ఫేస్ ఫ్యాక్ గా వేసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు, ముడతలు తగ్గిపోతాయి. తులసి ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తీసుకోవడం వల్ల కూడా మన శరీరానికి మేలు కలుగుతుంది.
తులసి ఆకులను ఉంచిన నీటిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన మలినాలు, విష పదార్థాలు తొలగిపోతాయి. తులసి ఆకులను తినడం వల్ల దంతాల, చిగుళ్ల సమస్యలు రాకుండా ఉంటాయి. నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. కడుపు నొప్పితోబాధపడే వారు ఒక టీ స్పూన్ తులసి ఆకుల రసంలో ఒక టీ స్పూన్ అల్లం రసాన్ని కలుపుకుని తాగడం వల్ల నొప్పి నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఈ విధంగా మనం నిత్యం పూజించే తులసి మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని తులసి ఆకులను పైన చెప్పిన విధంగా ఉపయోగించడం వల్ల ఆయా అనారోగ్య సమస్యల ఉండి ఉపశమనం కలుగుతుందని వారు తెలియజేస్తున్నారు.