Thelumani Plant : కాలానుగుణంగా వస్తున్న మార్పుల కారణంగా, విష రసాయనాల సంస్కృతి కారణంగా మన పూర్వీకులు మనకు అందించిన ఔషధాలను మరిచిపోయాము. ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్న మొక్కల్లో నేడు పిచ్చి మొక్కలుగా మంటల్లో కలిసిపోతున్నాయి. కనుమరుగైన అలాంటి ఔషధ మొక్కల్లో తేలు మణి మొక్క కూడా ఒకటి. దీనిని హస్తసుండి అని కూడా అంటారు. ఈ మొక్క పూలు ఏనుగు తొండంలాగా మెలి తిరిగి ఉంటాయి. కనుక దీనికి హస్త సుండి అనే పేరు వచ్చింది. ఈ మొక్క ఏక వార్షిక మొక్క. దీనిని లాటిన్ లో హిలో ట్రోపియం ఇండికం అని అంటారు. ఈ తేలు మణి మొక్క ప్రతి భాగం కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. తేలు మణి మొక్కలో ఉండే ఔషధ గుణాల గురించి అలాగే దీని వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మనకు వచ్చే అనేక రకాల చర్మ వ్యాధులను నయం చేయడంలో ఈ తేలు మణి మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మొక్క ఆకులతో కషాయాన్ని చేసుకుని తాగడం వల్ల గజ్జి, తామర, చిడుము, ఎక్సిమా వంటి చర్మ వ్యాధులన్నీ తగ్గుతాయి. 20 గ్రాముల తేలు మణి మొక్క ఆకులను 200 ఎమ్ ఎల్ నీటిలో వేసి 100 ఎమ్ ఎల్ అయ్యే వరకు బాగా మరిగించాలి. తరువాత ఈ కషాయాన్ని వడకట్టుకుని అందులో పటిక బెల్లం కలిపి పరగడుపున తాగాలి. అలాగే ఈ ఆకులను మెత్తగా నూరి ఆముదంలో వేసి వేడి చేయాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని చర్మం పై లేపనంగా రాసుకున్నా కూడా చర్మ వ్యాధులు తగ్గుతాయి. అలాగే ఈ ఆకుల రసాన్ని శరీరానికి రాసుకుని అరగంట తరువాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల దురదలు, దద్దుర్లు, చీముతో నిండి చెడు వాసన వస్తున్న కురుపులు కూడా తగ్గుతాయి.
అదే విధంగా ఈ ఆకుల రసాన్ని గాయాలపై రాయడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. అలాగే ఆకలిని పెంచడంలో తేలు మణి గింజలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. 2 గ్రాముల తేలు మణి గింజల పొడిని, 2 గ్రాముల త్రికటు చూర్ణాన్ని తీసుకుని తేనెతో కలిపి భోజనానికి ముందు తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది. ప్రస్తుత కాలంలో చాలా మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. మనల్ని అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడేలా చేస్తున్న ఈ డయాబెటిస్ ను మనం తేలు మణి మొక్కను ఉపయోగించి నియంత్రించుకోవచ్చు. తేలు మణి మొక్క వేర్లను, ఆకులను సమానంగా తీసుకుని కషాయంలా చేసుకోవాలి. ఈ కషాయాన్ని రోజూ ఉదయం పరగడుపున అలాగే సాయంత్రం పూట ఇలా రోజుకు రెండుసార్లు తీసుకోవడం వల్ల డయాబెటిస్ నియంత్రణలోకి వస్తుంది.
ఈ వేర్ల పొడిని తీసుకోవడం వల్ల దగ్గు, కఫం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. తేలుమణి మొక్క వేరు పొడిని 5 గ్రాములు, తేనె 5 గ్రాముల మోతాదులో కలిపి భోజనానికి ముందు తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల దగ్గు, కఫం వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే ఈ తేలుమణి మొక్క ఆకులను మెత్తగా నూరి రోజుకు మూడుసార్లు చిగుళ్లపై రాయాలి. అలాగే ఈ ఆకులతో చేసిన కషాయాన్ని తాగడం వల్ల చిగుళ్ల వాపు, చిగుళ్లు చీము పట్టడం వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ విధంగా తేలుమణి మొక్క మనకు ఉపయోగపడుతుందని దీనిని వాడడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.