Thippatheega : ఆయుర్వేద ఔషధాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే వాటిల్లో తిప్ప తీగ కూడా ఒకటి. తిప్ప తీగను మనలో చాలా మంది చూసే ఉంటారు. తిప్పతీగ మనుకు విరివిరిగా కనబడుతుంది. మనకు వచ్చే అనేక అనారోగ్య సమస్యలను నయం చేయడంలో తిప్పతీగ ఎంతగానో ఉపయోగపడుతుంది. షుగర్ వ్యాధి గ్రస్తులు తిప్ప తీగ చూర్ణాన్ని రోజుకు రెండు పూటలా తీసుకుంటూ ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. గోరు వెచ్చని పాలలో తిప్పతీగ చూర్ణంతోపాటు అల్లం రసాన్ని కలుపుకుని తాగడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
తిప్పతీగ ఆకుల చూర్ణాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, జ్వరాలు, దగ్గు, జలుబు వంటి వాటి బారిన పడకండా ఉంటాం. తిప్పతీగ ఆకుల్లో యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగస్ లక్షణాలు ఉంటాయి. ఈ ఆకుల చూర్ణాన్ని తీసుకోవడం వల్ల మనం ఇన్ ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాం. తిప్పతీగ చూర్ణాన్ని బెల్లంలో కలిపి తీసుకోవడం వల్ల అజీర్తి సమస్య తగ్గుతుంది. జీర్ణవ్యవస్థ పని తీరు కూడా మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి వాటితో బాధపడే వారు తిప్ప తీగ చూర్ణాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా ఈ చూర్ణాన్ని రోజూ తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
తిప్పతీగతో జ్యూస్, క్యాప్సుల్స్ వంటి వాటిని కూడా తయారు చేస్తారు. ఆయుర్వేదంలో వ్యాధికి అనుగుణంగా వీటిని ఉపయోగిస్తారు. తిప్పతీగ ఆకులను క్రమం తప్పకుండా రోజుకు రెండు పూటలా రెండేసి ఆకులను తినడం వల్ల ప్రారంభ దశలో ఉన్న మధుమేహం తగ్గుతుంది. అంతేకాకుండా తిప్ప తీగ ఆకులను తినడం వల్ల మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి జ్వరాలు కూడా తగ్గుతాయి. తిప్పతీగ ఆకులను ఉదయం లేదా సాయంత్రం భోజనానికి అరగంట ముందు ఒకటి లేదా రెండు చొప్పున 15 రోజుల పాటు తినడం వల్ల అధిక రక్త పోటు నియంత్రణలోకి వస్తుంది. అంతేకాకుండా శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు కూడా కరుగుతుంది.
ఇలా తిప్ప తీగ ఆకులను తినడం వల్ల దగ్గు, ఆయాసం, చర్మ సంబంధమైన సమస్యలు, గాయాలు, పుండ్లు, కాలేయ సంబంధిత సమస్యలు, మూత్ర పిండాలలో రాళ్లు, సకల వాత నొప్పులు వంటి అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి మనం బయటపడవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా తిప్పతీగ మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలియజేస్తున్నారు.