గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌డీఏ ప్రభుత్వం మరోమారు అధికారంలోకి వచ్చిన విషయం విదితమే. అటు ఏపీలో తెదాపాతోపాటు బీహార్‌లో నితీష్ కుమార్ పార్టీ వల్ల ఎన్‌డీఏ ప్రభుత్వానికి కావల్సిన మెజార్టీ వచ్చి ప్రభుత్వం ఏర్పడింది. అయితే ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని మాత్రం ఆపడం లేదు. ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందు ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను నిర్వహించగా.. ఇప్పుడు మరో యాత్రతో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే పలు చోట్ల ఆయన పాదయాత్ర చేస్తూ బీజేపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
దేశంలోని ప్రతి వ్యవస్థపై పెత్తనం చెలాయిస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్‌పై తాము పోరాడుతున్నాం అని రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. అయితే ఆయన ఈ కామెంట్స్ చేయడం ఏమోగానీ ఓ వ్యక్తి రాహుల్‌పై ఫిర్యాదు చేశాడు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. బీహార్‌కు చెందిన ముకేష్ కుమార్ అనే పాల వ్యాపారి రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దేశంలోని ప్రతి వ్యవస్థపై పెత్తనం చెలాయిస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లపై పోరాడుతున్నాం అని రాహుల్ చేసిన వ్యాఖ్యలతో తాను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యానన్నాడు.
దీంతో తన చేతిలో ఉన్న పాల డబ్బా కిందపడిందని, 5 లీటర్ల పాలు నేలపాలయ్యాయని చెప్పాడు. రూ.250 నష్టం జరిగిందంటూ ఈ ఘటనకు కారణమైన రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశాడు. అయితే దీనిని కాంగ్రెస్ పార్టీ నేతలు ఖండిస్తున్నారు. అధికార ఎన్‌డీఏ ప్రభుత్వ నాయకులు కావాలనే తమ పార్టీ నేతపై ఇలా కేసులు పెట్టిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. అయితే దీనిపై రాహుల్ స్పందించాల్సి ఉంది.