పొట్ట దగ్గరి కొవ్వును కరిగించుకోవాలంటే ఎన్ని ఇబ్బందులు పడాల్సి ఉంటుందో అందరికీ తెలుసు. అయితే ఇందుకు యాపిల్ సైడర్ వెనిగర్ ఎంతగానో దోహద పడుతుంది. ఇది శరీర మెటబాలిజంను పెంచుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫళితంగా అధిక బరువును త్వరగా తగ్గించుకోవచ్చు. యాపిల్ పండ్లను బాగా పేస్ట్‌లా చేసి వాటిని పులవబెడతారు. దీంతో యాపిల్ సైడర్ వెనిగర్ తయారవుతుంది. అందువల్ల ఇది సహజసిద్ధమైన పదార్థం అని చెప్పవచ్చు. యాపిల్ సైడర్ వెనిగర్ పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలోనూ అద్భుతంగా ఉపయోగపడుతుంది. అయితే అధిక బరువును, పొట్ట దగ్గరి కొవ్వును తగ్గించుకోవాలంటే యాపిల్ సైడర్ వెనిగర్‌ను ఎప్పుడు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
యాపిల్ సైడర్ వెనిగర్ లో చాలా స్వల్ప మోతాదులో క్యాలరీలు ఉంటాయి. ఇది అద్భుతమైన డిటాక్సిఫైయింగ్ డ్రింక్‌లా కూడా పనిచేస్తుంది. అంటే శరీరంలోని విష, వ్యర్థ పదార్థాలను బయటకు పంపిస్తుందన్నమాట. అలాగే నిత్యం దీన్ని తగినంత మోతాదులో తీసుకుంటే పొట్ట దగ్గరి కొవ్వు కరుగుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొవ్వును కరిగిస్తాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది.
యాపిల్ సైడర్ వెనిగర్‌ను తాగడం వల్ల ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది. అదుపు తప్పి, అతిగా ఆహారం తినకుండా ఉంటారు. దీంతో బరువు సులభంగా తగ్గవచ్చు. అయితే అధిక బరువును, పొట్ట దగ్గరి కొవ్వును సులభంగా, వేగంగా కరిగించుకోవాలంటే నిత్యం ఉదయాన్నే పరగడుపునే యాపిల్ సైడర్ వెనిగర్‌ను తాగాల్సి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిత్యం ఉదయాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 1 టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌ను కలిపి పరగడుపునే తాగడం వల్ల అధిక బరువు త్వరగా తగ్గుతారని చెబుతున్నారు. దీంతోపాటు శరీరంలో ఉండే వ్యర్థాలు కూడా బయటకు వెళ్లిపోతాయి. శరీర పీహెచ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. మెటబాలిజం పెరుగుతుంది. శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి.
ఇక రాత్రి పూట యాపిల్ సైడర్ వెనిగర్‌ను తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇది బరువు తగ్గేందుకు ఏ విధంగానూ సహాయపడదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
యాపిల్ సైడర్ వెనిగర్‌ను కచ్చితంగా నీటిలో కలుపుకునే తాగాల్సి ఉంటుంది. నేరుగా తాగకూడదు. ఇందులో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. కనుక నేరుగా తాగితే దంతాల ఎనామిల్‌పై ప్రభావం పడుతుంది. ఎనామిల్ త్వరగా దెబ్బతింటుంది. అందువల్ల యాపిల్ సైడర్ వెనిగర్‌ను నీటిలో కలుపుకునే తాగాలి. అయితే కొందరికి దీన్ని తాగితే అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు రావచ్చు. అలా గనక జరిగితే దీన్ని తాగడం ఆపేయాలి. ఇక ఏ సమస్యలూ రాకపోతే దీన్ని తాగడం కొనసాగించవచ్చు. దీంతో బరువు వేగంగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది.