Mango : వేసవికాలంలో మనకు విరివిగా లభించే పండ్లలో మామిడి పండ్లు ఒకటి. వీటిని తినడం వల్ల మనకు అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. మామిడి పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనకు ఎంతగానో మేలు చేస్తాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే మామిడి పండ్లను తినడంలో చాలా మందికి అనేక అపోహలు ఉంటాయి. వాటిల్లో ఒకటి ఏమిటంటే.. గర్భంతో ఉన్న మహిళలు ఈ పండ్లను తినవచ్చా ? అని సందేహాలు వస్తుంటాయి. అయితే ఇందుకు నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో.. ఇప్పుడు తెలుసుకుందాం.
మామిడి పండ్లను గర్భిణీలు తినవచ్చు. ఇందులో భయపడాల్సిన పనిలేదు. కాకపోతే పరిమిత మోతాదులో తినాలి. అధికంగా తింటే వేడి ఎక్కువై ఇబ్బందులు వస్తాయి. కనుక తక్కువ పరిమాణంలో ఈ పండ్లను గర్భిణీలు రోజూ తినవచ్చు. ఇలా తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఆబ్‌స్టిట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ (ఏసీవోజీ) పరిశోధకులు చెబుతున్న ప్రకారం.. మామిడి పండ్లను తినడం వల్ల గర్భిణీలకు ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా వారికి కీలకమైన పోషకాలు లభిస్తాయి. మామిడి పండ్లను తినడం వల్ల ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు, కొవ్వులు, విటమిన్స్, మినరల్స్ అన్నీ లభిస్తాయి.
మామిడి పండ్లలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది గర్భిణీల్లో లోపిస్తే పుట్టబోయే పిల్లల్లో రక్తం తక్కువగా ఉంటుంది. అలాగే నెలలు నిండకుండానే శిశువు జన్మించేందుకు అవకాశాలు ఉంటాయి. దీంతోపాటు బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉండదు. ఇలా విటమిన్ ఎ లోపంతో గర్భిణీల్లో సమస్యలు వస్తాయి. కానీ మామిడి పండ్లను తింటే విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. కనుక ఈ లోపం రాకుండా చూసుకోవచ్చు. అప్పుడు బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది.
ఇక మామిడి పండ్లలో ఫోలిక్ యాసిడ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. 100 గ్రాముల పండ్లను తింటే సుమారుగా 94 మైక్రోగ్రాముల వరకు ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది. ఇది గర్భిణీల్లో పిండం ఎదుగుదలకు, పిండం వెన్నెముక పెరుగుదలకు, మెదడు పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక మామిడి పండ్లను తింటే గర్భిణీలకు ఎంతో మేలు జరుగుతుంది. దీంతోపాటు శిశువుకు విటమిన్లు సి, బి1, బి2, ఇ, మినరల్స్ కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, పొటాషియం, సోడియం, మెగ్నిషియం, జింక్ లభిస్తాయి. కనుక గర్భిణీలు ఎట్టి పరిస్థితిలోనూ మామిడి పండ్లను విడిచిపెట్టవద్దు. వీటిని పరిమిత మోతాదులో తింటే అనేక లాభాలను పొందవచ్చు. దీని వల్ల పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది.