సాధారణంగా చాలా మంది బొప్పాయి పండ్లను పండిన తరువాతే తింటారు. కానీ పచ్చి బొప్పాయిలను కూడా తినవచ్చు. అవును. బొప్పాయిలను పచ్చిగా కూడా తినవచ్చు. ఇంకా చెప్పాలంటే పండిన బొప్పాయి పండ్ల కంటే ఎక్కువ పోషకాలు, ఎంజైమ్‌లు పచ్చి బొప్పాయిలలోనే ఉంటాయి. కనుక పచ్చి బొప్పాయిలను తింటేనే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి.
అయితే పచ్చి బొప్పాయిలలో ఉండే లేటెక్స్ ఫ్లుయిడ్ వల్ల కొందరికి అలర్జీలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీని వల్ల చర్మంపై దద్దుర్లు వస్తాయి. అలా గనక ఎవరికైనా వస్తే వెంటనే పచ్చి బొప్పాయిలను తినడం మానేయాలి. అలాగే గర్భిణీలు కూడా పచ్చి బొప్పాయిలను తినరాదు. ఇక మిగిలిన ఎవరైనా సరే పచ్చి బొప్పాయిలను తినవచ్చు.
పచ్చి బొపాయిల పైభాగం ఆకుపచ్చ రంగులో ఉంటుంది. లోపలి భాగం క్రీమ్ లేదా తెలుపు రంగులో ఉంటుంది. ఇది తియ్యగా ఉండదు. తినేందుకు కష్టంగా ఉంటుంది. అందువల్ల దీన్ని ఉడకబెట్టుకుని తినవచ్చు. లేదా వెజిటబుల్ సలాడ్స్‌లో కలిపి తీసుకోవచ్చు.
1. పచ్చి బొప్పాయిలను తినడం వల్ల మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ఆ ఇన్‌ఫెక్షన్లకు కారణం అయ్యే బాక్టీరియా నశిస్తుంది.
2. పచ్చి బొప్పాయిలలో పండిన వాటి కన్నా ఎక్కువగా ఎంజైమ్‌లు ఉంటాయి. ముఖ్యంగా పపైన్, కైమోపపిన్‌లు అధికంగా ఉంటాయి. దీని వల్ల జీర్ణాశయం ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగు పడుతుంది.
3. పచ్చి బొప్పాయిలలో విటమిన్లు ఎ, సి, ఇలు అధికంగా ఉంటాయి. అందువల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.