Potato : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే బంగాళాదుంపలను తమ ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. ఇది మనకు వంట గదిలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది. దీంతో అనేక రకాల వంటకాలను తరచూ చేస్తుంటారు. వంటింట్లో కూరగాయలు లేవు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఆలుగడ్డనే. దీంతో ఏ కూర చేసినా త్వరగా అవుతుంది. ఆలుగడ్డలు లేకుండా మన కూరలు పూర్తి కావు అంటే అతిశయోక్తి కాదు. దీన్ని నేరుగా అలాగే వండుకోవచ్చు లేదా ఇతర కూరలతో కలిపి కూడా వండుకోవచ్చు. ఆలుగడ్డలు అంటే చాలా మందికి ఇష్టమే. అయితే వీటిని తింటే బరువు పెరుగుతామని చాలా మంది భావిస్తారు. అందువల్ల బరువు తగ్గే ప్రయత్నం చేసే వారు, అధిక బరువు ఉన్నవారు బంగాళాదుంపలను తినేందుకు వెనుకడుగు వేస్తుంటారు.
వాస్తవానికి మనం చెడు జీవనశైలి కారణంగా బరువు పెరుగుతాం. దీంతో చాలా మంది ఊబకాయం బారిన పడుతుంటారు. బరువును తగ్గించుకునేందుకు మనం ఆలుగడ్డలతో చేసిన వాటిని తినడం మానేస్తాం. అయితే బరువు ఉన్నవారు ఆలుగడ్డలను తినకూడదా, వీటిని తింటే బరువు పెరుగుతారా.. అని చాలా మంది సందేహిస్తుంటారు. దీనికి వైద్య నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
బంగాళాదుంపల్లో కార్బొహైడ్రేట్లు ఉండే మాట వాస్తవమే. అయితే బంగాళా దుంపలను ఉడకబెట్టి తింటే ఏమీ కాదట. దీంతో బరువు పెరగరని వైద్యులు చెబుతున్నారు. ఆలుగడ్డలను చిప్స్ లేదా వేపుడు రూపంలో, జంక్ ఫుడ్ రూపంలో తింటేనే బరువు పెరుగుతారట. అలా చేయడం వల్ల ఆయా ఫుడ్స్‌లో క్యాలరీలు విపరీతంగా పెరిగిపోతాయి. ఉడకబెట్టిన ఆలుగడ్డల్లో అన్ని క్యాలరీలు ఉండవు. అందువల్ల ఆలుగడ్డలను తింటే బరువు పెరుగుతామన్నది అపోహే అని అంటున్నారు. అయితే ఆలుగడ్డలను వేపుడు, చిప్స్, జంక్ ఫుడ్ రూపంలో మాత్రం తినొద్దని సూచిస్తున్నారు.