Fruits : సాధారణంగా చాలా మంది పళ్లను తినడకం కన్నా పళ్ల రసాలను చేసుకుని తాగడం సులభంగా ఉంటుందని చెప్పి.. పళ్ల రసాలనే ఎక్కువగా తాగుతుంటారు. చాలా మంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్ సమయంలో ఇంట్లో తయారు చేసిన పళ్ల రసాలను తాగుతుంటారు. అయితే పళ్ల రసాలు ఆరోగ్యానికి మంచివే. కానీ.. వీటి వల్ల కొన్ని నష్టాలు ఉంటాయి.
పళ్ల రసాల్లో ఫైబర్ తక్కువగా, చక్కెర శాతం అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని తాగిన వెంటనే శరీరంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఏమాత్రం మంచిది కాదు. కనుక వారు పళ్ల రసాలను తాగరాదు. కానీ పళ్లను తినవచ్చు. ఎందుకంటే వాటిల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక వాటిని తిన్న వెంటనే శరీరంలో షుగర్ లెవల్స్ పెరగవు. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారికి పళ్ల రసాల కన్నా పళ్లే ఎంతగానో మేలు చేస్తాయని చెప్పవచ్చు.
ఇక కొందరు మార్కెట్‌లో లభించే ప్యాక్ చేయబడిన పండ్ల రసాలను తాగుతుంటారు. వాస్తవానికి ఇంట్లో తయారు చేసిన పళ్ల రసాలే శ్రేయస్కరం. ప్యాక్‌లలో అమ్మబడే వాటిల్లో అదనంగా చక్కెర కలుపుతారు. అలాగే రసాయనాలు కలిపి ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేస్తారు. ఈ క్రమంలో పండ్ల రసాలను తయారు చేసి ప్యాక్ చేసే ప్రక్రియలో వాటిల్లో ఉండే పోషకాలు నశిస్తాయి. పండ్ల రసాల్లో మనకు లభించే రసం మోతాదు తక్కువగానే ఉంటుంది. మిగిలినవి నీళ్లు, చక్కెర వంటివి ఉంటాయి. కనుక మార్కెట్‌లో మనకు లభించే ప్యాక్ చేయబడిన పండ్ల రసాల కన్నా మనం ఇంట్లోనే వాటిని తయారు చేసుకుంటే మంచిది.
అయితే పళ్ల రసాలు, పండ్లు.. రెండింటిలో ఏవి మంచివి అనే విషయానికి వస్తే.. పండ్లే మంచివి అని చెప్పవచ్చు. ఎందుకంటే పైన చెప్పినట్లుగా పండ్ల రసాలను తాగితే షుగర్ లెవల్స్ అమాంతం పెరుగుతాయి. అయితే షుగర్ లేనివారిలో కూడా అలాగే జరుగుతుంది. కానీ వారిలో ఇన్సులిన్ బాగా పనిచేస్తుంది కనుక షుగర్ లెవల్స్ వెంటనే తగ్గిపోతాయి. అయినప్పటికీ ఆరోగ్యవంతులు రోజూ పళ్ల రసాలను తాగితే వారికి డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. కనుక పండ్ల రసాలను తాగే బదులుగా పండ్లను తింటేనే మంచిదని సూచిస్తున్నారు.
పండ్లను తినడం వల్ల ఫైబర్ పుష్కలంగా అందుతుంది. పండ్ల రసాల్లో ఇది ఉండదు. కనుక పండ్లనే తినాలి. దీంతో ఫైబర్ లభించి మన శరీరంలో జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అజీర్ణం, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు. జీర్ణాశయం శుభ్రంగా మారుతుంది.
పండ్లను తినేందుకు మనం దంతాలను ఎక్కువగా ఉపయోగిస్తాం కనుక దంతాలకు, నోటికి చక్కని వ్యాయామం అవుతుంది. దీంతో ఆ భాగంలో కండరాల కదలికలు బాగుంటాయి. దీని వల్ల నోటి సమస్యలు ఉండవు. దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి.
పండ్లను తినడం వల్ల ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదని సైంటిస్టులు చెబుతున్నారు. ఎందుకంటే వాటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక పండ్లను తింటే చాలా సేపు ఉన్నా ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీంతో ఎక్కువ ఆహారం తినకుండా ఉంటారు. ఫలితంగా ఇది అధిక బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది.
పండ్లను తినడం వల్ల అధిక బరువును తగ్గించుకోవడంతోపాటు షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. లివర్ శుభ్రంగా మారుతుంది. లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఎటు చూసినా పండ్ల రసాల కన్నా పండ్లే ఉత్తమమైనవని చెప్పవచ్చు.