దానిమ్మ పండ్లను చూడగానే ఎవరికైనా సరే నోరూరిపోతుంది. వాటి లోపలి విత్తనాలు చూసేందుకు భలే ఆకర్షణీయంగా ఉంటాయి. దానిమ్మ పండ్లను చాలా మంది నేరుగానే తింటారు. కొందరు జ్యూస్ రూపంలో తీసుకుంటారు. అయితే కిడ్నీ సమస్యలు ఉన్నవారు దానిమ్మ పండ్లను తీసుకుంటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ? అసలు ఏమైనా ప్రయోజనం కలుగుతుందా ? అంటే…
కిడ్నీ సమస్యలు ఉన్నవారికి దానిమ్మ పండ్లు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఈ మాటను సైంటిస్టులే చెప్పారు. ఈజిప్టుకు చెందిన హెల్వాన్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ జువాలజీ విభాగం, సౌదీ అరేబియాలోని కింగ్ సౌద్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్సెస్ జువాలజీ విభాగం సైంటిస్టులు సంయుక్తంగా ఎలుకలపై పరిశోధనలు నిర్వహించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.
దానిమ్మ పండ్లను లేదా వాటి పొట్టును లేదా జ్యూస్‌ను తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు తగ్గుతాయని గుర్తించారు. ముఖ్యంగా కిడ్నీ స్టోన్లు ఉన్నవారు దానిమ్మ పండ్ల జ్యూస్‌ను సేవిస్తే ప్రయోజనం ఉంటుందని తెలిపారు.
ఇక ఆయుర్వేదంలో దానిమ్మ గురించి కూడా చెప్పారు. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో వేడి పెరగదు. అలాగని చలువ చేయదు. మధ్యస్థంగా ఉంటుంది. తీపి, పులుపు, వగరు మిశ్రమంగా ఈ పండ్లు ఉంటాయి. ఆయుర్వేద ప్రకారం నిత్యం దానిమ్మ పండ్ల జ్యూస్‌ను ఒక గ్లాస్ మోతాదులో ఉదయాన్నే పరగడుపునే తాగాల్సి ఉంటుంది. దీంతో కిడ్నీ స్టోన్లు పడిపోతాయి. దానిమ్మ పండ్లలో ఉండే పాలిఫినాల్స్ కిడ్నీలను సంరక్షిస్తాయి. దీంతో కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.