దోశలలో అనేక రకాలు ఉన్నాయి. వాటిల్లో రవ్వ దోశ కూడా ఒకటి. ఒక్కొక్కరూ ఒక్కో రకంగా రవ్వ దోశలను తయారు చేస్తుంటారు. అయితే రుచితోపాటు పోషకాలు కూడా ఉండే విధంగా రవ్వ దోశను తయారు చేసుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. ఒక కప్పు రవ్వ, ఒక కప్పు గోధుమ పిండి, అర కప్పు బియ్యం పిండి, ఒక కప్పు తాజా పెరుగులను తీసుకుని బాగా కలపాలి.
2. ఆ మిశ్రమంలో ఉప్పు, ఒక కప్పు నీరు కలిపి మిక్స్ చేయాలి.
3. ఆ మిశ్రమాన్ని 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. దీంతో రవ్వ మొత్తం నీటిని పీల్చుకుంటుంది.
4. పిండి ఇంకా జోరుగా కావాలంటే ఇంకొంచెం నీటిని కలుపుకోవచ్చు.
5. ఆ పిండిని 6 నుంచి 7 గంటల పాటు అలాగే ఉంచాలి.
6. తరువాత పాన్ తీసుకుని దానిపై నూనె వేసి వేడి చేయాలి.
7. పిండిని తీసుకుని దాన్ని 4 ఇంచుల ఎత్తు నుంచి పెనంపై పోయాలి. దీంతో దీశపై చిన్న రంధ్రాలు ఏర్పడుతాయి. దీని వల్ల దోశ బాగా కాలుతుంది.
8. మినపపప్పు వేసి తయారు చేసే దోశ పిండిని పాన్‌పై ముందుగా మధ్యలో వేస్తారు. కానీ ఈ పిండిని పెనంపై ముందుగా చివర్లో వేయాలి. తరువాత మధ్యకు రావాలి.
9. దోశపై ఏర్పడే చిన్న చిన్న రంధ్రాల మీద, చివర్లో నూనె వేయాలి.
10. బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చిలతోపాటు జీలకర్రను దోశపై చల్లాలి. పోషకాలు కావాలంటే తరిగిన క్యారెట్ తోపాటు మొక్కజొన్న, చీజ్ వంటి పదార్థాలను వేసుకోవచ్చు.
11. దోశను చాలా సన్నని మంట మీద కాల్చాలి.
12. దోశ మీద చిన్న చిన్న రంధ్రాలు పడతాయి కనుక రెండో వైపు కాల్చాల్సిన పని ఉండదు. పోషకాల కోసం పైన తెలిపిన పదార్థాలను వేస్తే రెండో వైపు కాల్చడం కష్టం అవుతుంది. కానీ చిన్న చిన్న రంధ్రాలు పడుతాయి కనుక దోశ రెండో వైపు కాలాల్సిన పనిలేదు. ఒక వైపునే సన్నని మంట మీద బాగా కాలితే చాలు.
13. అనంతరం దోశను మడతబెట్టి సర్వ్ చేయవచ్చు. దీన్ని కొబ్బరి చట్నీతో తింటే రుచి, పోషకాలు రెండూ లభిస్తాయి.
పెరుగు మరీ పుల్లగా ఉంటే దోశ పెనంకు అతుక్కుపోతుంది. కనుక కొద్దిగా రవ్వ, పిండి, నీళ్లను కలపాల్సి ఉంటుంది. పెనం మరీ బాగా వేడిగా అయితే కొద్దిగా నీటిని చల్లాలి. దీంతో నెమ్మదిగా చల్లగా అవుతుంది. రవ్వ దోశను ఇలా తయారు చేసుకుంటే రుచిగా ఉండడమే కాదు, ఆయా పదార్థాలతో పోషకాలు, శక్తి కూడా లభిస్తాయి.