ఆరోగ్యంగా ఉండాలంటే మనం రోజూ వ్యాయామం చేయాలన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా మంది ఉదయం లేదా సాయంత్రం వ్యాయామం చేస్తుంటారు. కొందరు వ్యాయామం కోసం జిమ్‌కు వెళ్తుంటారు. ఇంకా కొందరు పార్కుల్లో, ఇంటి దగ్గర వాకింగ్, రన్నింగ్ లాంటివి చేస్తుంటారు. అయితే వాకింగ్ చేసే చాలా మందికి ఒక సందేహం వస్తుంటుంది. అదేమిటంటే.. వాకింగ్‌ను ఉదయం చేయాలా, సాయంత్రం చేయాలా..? ఏ సమయంలో వాకింగ్ చేస్తే మంచిది ? ఏ సమయంలో వాకింగ్ చేయడం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది..? అన్న సందేహాలు వస్తుంటాయి. అయితే ఇందుకు ఆరోగ్య నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రంతా మన శరీరం గ్లూకోజ్‌ను ఖర్చు చేసి ఉంటుంది. అందుకనే ఉదయం నిద్ర లేవగానే మనకు ఆకలి అవుతుంది. ఆ సమయంలో శరీరంలో గ్లూకోజ్ ఉండదు. దీంతో శక్తి కోసం మన శరీరం కొవ్వుపై ఆధార పడుతుంది. ఫలితంగా అదే సమయంలో మనం వ్యాయామం చేస్తే శరీరం కొవ్వును కరిగిస్తుంది. అదే సాయంత్రం అయితే మన శరీరంలో ఉన్న గ్లూకోజ్ వినియోగం అవుతుంది. కొవ్వు ఖర్చు కాదు. కనుక కొవ్వు వేగంగా కరగాలి అనుకునేవారు ఉదయం పూట వ్యాయామం చేస్తేనే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇక ఉదయం సమయంలో ఎండ ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మన శరీరం విటమిన్ డి తయారు చేసుకునేలా చేస్తుంది. సాయంత్రం ఎండ మంచిది కాదని చెబుతుంటారు. ఆ ఎండలో అతినీలలోహిత కిరణాలు అధికంగా ఉంటాయంటారు. కనుక మన శరీరానికి చక్కని సూర్య రశ్మి కావాలన్నా, శరీరం విటమిన్ డిని తయారు చేసుకోవాలన్నా మనకు ఉదయం ఎండనే మేలు చేస్తుంది. కనుక ఉదయం వ్యాయామం చేయడమే మంచిది. అలాగే ఉదయం వ్యాయామం చేయడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో రోజంతా మన శరీరం క్యాలరీలను ఖర్చు చేస్తూనే ఉంటుంది. శరీరంలోని కొవ్వు కరుగుతుంది. దీంతో సులభంగా బరువు తగ్గుతారు. కాబట్టి ఏ రకంగా చూసినా ఉదయం వ్యాయామమే మంచిదని నిపుణులు అంటున్నారు.