భోజ‌నం చేసిన వెంట‌నే తీపి ప‌దార్థాల‌ను తినాల‌ని ఎందుకు అనిపిస్తుందో తెలుసా ?

సాధార‌ణంగా చాలా మంది భోజ‌నం చేసిన వెంట‌నే తీపి ప‌దార్థాల‌ను తింటుంటారు. కొంద‌రు సోంపు గింజ‌లు లేదా పండ్ల‌ను తినేందుకు ఆస‌క్తిని చూపిస్తారు. అయితే ఇవి తింటే ఫ‌ర్వాలేదు, కానీ భోజనం చేశాక తీపి ప‌దార్థాల‌ను తింటేనే ప్ర‌మాదం. అస‌లు భోజ‌నం చేశాక ఎవ‌రికైనా సరే తీపి ప‌దార్థాల‌ను తినాల‌ని ఎందుకు అనిపిస్తుంది ? దీని వెనుక ఉన్న కార‌ణాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

why we crave for sweets after taking meals

సాధార‌ణంగా భార‌తీయ ఆహార విధానంలో కార్బొహైడ్రేట్లు (పిండి ప‌దార్థాలు) ఒక భాగం. ఇవి ఉండే ఆహారాల‌నే మ‌నం ఎక్కువగా తింటుంటాం. ఉత్త‌రాది వారు గోధుమల‌తో త‌యారు చేసే రొట్టెలు తిన్నా.. ద‌క్షిణాది వారు అన్నం తిన్నా.. ఈ రెండింటిలోనూ కార్బొహైడ్రేట్లు ప్ర‌ధాన‌మైన‌వి. అయితే వీటితోపాటు మనం తినే కొన్ని ఆహారాల్లో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. మ‌నం తినే పిండి ప‌దార్థాల వ‌ల్ల మ‌న శ‌రీరం కొన్ని ఆహారాల్లో ఉండే ఆ ట్రిప్టోఫాన్‌ను శోషించుకుంటుంది. ఇక ట్రిప్టోఫాన్ మ‌న శ‌రీరంలో సెర‌టోనిన్‌ను ఉత్ప‌త్తి చేస్తుంది. ఇదొక న్యూరో ట్రాన్స్‌మిట‌ర్‌. మూడ్‌ను మారుస్తుంది.

సెర‌టోనిన్‌ను ఫీల్ గుడ్ హార్మోన్ అంటారు. ఇది ఉత్ప‌త్తి అవ‌డం వ‌ల్ల మ‌నం ప్ర‌శాంతంగా మారిపోతాం. సంతృప్తి చెందుతాం. ఆ స్థితిలో తీపి తినాల‌ని శ‌రీరం స‌హ‌జంగానే ఉవ్విళ్లూరుతుంది. దీంతో తీపి తినాల‌నిపిస్తుంది. ఆ ప‌దార్థాల‌ను తింటారు. ఇక ఇదే క్ర‌మంగా అల‌వాటు అవుతుంది. దాన్నుంచి బ‌య‌ట ప‌డ‌లేరు. భోజ‌నం చేశాక క‌చ్చితంగా తీపి ప‌దార్థాల‌ను తింటారు.

అయితే కొంద‌రిలో మాత్రం ఇలా కాదు. వారు భోజ‌నం చేశాక తీపి తినాల‌నే నియమం పెట్టుకుంటారు. దీంతో వారికి అది అల‌వాటు అవుతుంది. దాన్ని వారు మాన‌లేరు. ఇలా చాలా మంది ఈ రెండు ర‌కాల కార‌ణాల వ‌ల్ల భోజ‌నం చేశాక తీపి ప‌దార్థాల‌ను తింటుంటారు.

కానీ నిజానికి భోజ‌నం అనంత‌రం శ‌రీరంలో షుగ‌ర్ లెవ‌ల్స్ ఎక్కువ‌గా పెరుగుతాయి క‌నుక ఆ స్థితిలో తీపి తిన‌రాదు. తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ ఇంకా ఎక్కువ‌య్యేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక భోజ‌నం చేసిన వెంట‌నే తీపి తిన‌రాదు. పైన తెలిపిన‌ట్లుగా సోంపు గింజ‌లు లేదా పండ్ల‌ను తింటే మంచిది. లేదా హెర్బ‌ల్ టీల‌ను తాగ‌వ‌చ్చు.

భోజ‌నం అనంత‌రం తీపి తినాల‌నే యావ త‌గ్గాలంటే భోజ‌నంలో ఎక్కువ‌గా కూర‌గాయ‌లు ఉండేలా చూసుకోవాలి. పిండి ప‌దార్థాల‌ను త‌క్కువ‌గా తినాలి. భోజ‌నానికి ముందు కీర‌దోస‌, ట‌మాటా, క్యారెట్‌, బీట్‌రూట్ వంటి వాటిని ముక్క‌లుగా కోసి స‌లాడ్ రూపంలో తినాలి. దీంతో భోజ‌నం చేశాక క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. తీపి తినేందుకు ఇష్ట ప‌డ‌రు. ఇలా భోజనం చేశాక తీపి తినాల‌నే అల‌వాటును సుల‌భంగా మానుకోవ‌చ్చు.

Share
Admin

Recent Posts