అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

సెల్ఫీలు ఎక్కువ‌గా దిగే వారు త్వ‌ర‌గా ముస‌లి వారు అవుతారట తెలుసా..?

సెల్ఫీ… ఇప్పుడు ఇదో ర‌కం మోజు అయిపోయింది. స్మార్ట్‌ఫోన్స్ ఉన్న ప్ర‌తి ఒక్క‌రు సెల్ఫీలు తీసుకోవ‌డం, వాటిని సోష‌ల్ సైట్ల‌లో పెట్ట‌డం, లైక్‌లు, కామెంట్లు కొట్టించుకోవ‌డం ఇప్పుడు ఎక్కువైపోయింది. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. అవ‌స‌రం ఉన్నా లేక‌పోయినా ఎడా పెడా సెల్ఫీలు దిగుతున్నారు. అయితే మీకు తెలుసా? సెల్ఫీల వ‌ల్ల చ‌ర్మ సంబంధ వ్యాధులు వ‌స్తాయ‌ని. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. సెల్ఫీల వ‌ల్ల చ‌ర్మ సంబంధ వ్యాధులు వ‌స్తాయ‌ని ప‌లువురు శాస్త్రవేత్త‌లు ఇటీవ‌ల చేసిన పరిశోధ‌న‌ల్లో తెలిసింది.

యునైటెడ్ కింగ్‌డ‌మ్ (యూకే)లోని లినియా స్కిన్ క్లినిక్ బృందం ప‌రిశోధ‌కులు సెల్ఫీలు ఎక్కువ‌గా దిగుతున్న కొంద‌రిపై ఇటీవ‌ల ప‌రిశోధ‌న‌లు చేశారు. కాగా ఆ ప‌రిశోధ‌నల వ‌ల్ల తెలిసిందేమిటంటే సెల్ఫీ దిగే స‌మ‌యంలో ఫోన్ తెర ఎదురుగా ఉంటుంది కాబ‌ట్టి దాన్నుంచి వ‌చ్చే కాంతి, ముందు భాగంలో ఒక వేళ ఫ్లాష్ ఉంటే దాన్ని నుంచి వ‌చ్చే కాంతి, ఫోన్ విడుద‌ల చేసే రేడియేష‌న్ ఈ మూడు నేరుగా ముఖంపైకి ప్ర‌స‌రిస్తున్నాయ‌ట‌. దీని వ‌ల్ల సెల్ఫీలు దిగుతున్న వారిలో చ‌ర్మ సంబంధ స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ట‌. ముఖంపై ఉన్న చ‌ర్మ క‌ణాలు నాశ‌న‌మ‌వ‌డం, ముఖం ముడ‌త‌లు ప‌డ‌డం వంటి స‌మస్య‌లు దీర్ఘ‌కాలంలో వ‌స్తాయ‌ని ఆ ప‌రిశోధ‌న‌కు నేతృత్వం వ‌హించిన డాక్ట‌ర్ సిమోన్ జొకెయ్ వెల్ల‌డించారు. అంటే ఎక్కువ‌గా సెల్ఫీలు దిగితే త్వ‌ర‌గా ముస‌లి వారు అవ‌డం ఖాయ‌మ‌న్న‌మాట‌!

old age comes early to those who take more selfies

స్మార్ట్‌ఫోన్ల నుంచి వ‌చ్చే ఎల‌క్ట్రో మాగ్నెటిక్ రేడియేష‌న్ వ‌ల్ల మ‌న శ‌రీరంలో ఉన్న డీఎన్ఏ కూడా నాశ‌న‌మ‌వుతుందని ప‌రిశోధ‌కులు హెచ్చ‌రిస్తున్నారు. సెల్ఫీలు దిగే వారిలో అలా రేడియేష‌న్‌కు గుర‌య్యేందుకు అవ‌కాశం ఇంకా ఎక్కువ‌గా ఉంటుంద‌ని వారు చెబుతున్నారు. మ‌న శ‌రీరంలో ఉండే రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ పైన చెప్పిన ఎల‌క్ట్రో మాగ్నెటిక్ రేడియేష‌న్‌కు బాగా దెబ్బ‌తింటుంద‌ని, అందువ‌ల్ల ఇత‌ర అనారోగ్యాల బారి నుంచి కూడా మ‌న‌ల్ని మ‌నం కాపాడుకోవ‌డం క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంద‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు. విన్నారుగా, సెల్ఫీల‌ను దిగ‌డం వ‌ల్ల ఎలాంటి ముప్పు వ‌స్తుందో, కాబ‌ట్టి జాగ్ర‌త్త‌! ఎంతైనా మ‌న ఆరోగ్యం మ‌న‌కు ముఖ్యం క‌దా!

Admin

Recent Posts